చంద్రబాబు.. ఓట్లు అడుక్కునే పద్ధతి ఇది కాదు.!

Chandra Babu Vijayawada Road Show

తప్పదు, కొన్నిసార్లు ‘అవసరమైన పదం’ ఖచ్చితంగా వాడాల్సిందే. ఔను, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఓటర్ల పిల్లల ‘ముడ్డి’ కడిగిన సందర్భాలున్నాయి. కానీ, ఓటర్లను బెదిరించడం.. అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. సంక్షేమ పథకాలు ఎందుకు.? అంటే, ఇంకెందుకు ఓట్ల కోసం. ‘నేను వేయించిన రోడ్ల మీద నడుస్తారు.. నాకు ఓట్లు మాత్రం వెయ్యరా.?’ అని కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రశ్నించి అభాసుపాలయ్యారు.

‘మగడా, అవి జనం డబ్బులతో వేయించే రోడ్లు.. ప్రభుత్వ ఖజానా అది. పార్టీలకు చెందినది కాదు..’ అని జనం, 2019 ఎన్నికల్లో టీడీపీ చెంప ఛెళ్ళుమనిపించేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కొందరు కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబుని మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అది కాస్తా వైసీపీ కొంప ముంచేస్తోంది. పంచాయితీ ఎన్నికల్లోనే ఈ దెబ్బ వైసీపీకి కొన్ని చోట్ల గట్టిగా తగిలింది. మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థతి. అధినేత వైఎస్ జగన్, పార్టీలో కొందరు నేతలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సిందే.

ఇక, చంద్రబాబు విషయానికొస్తే, విజయవాడలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హద్దులు దాటారు. జనాన్ని నిలదీశారు. హెచ్చరించారు. ఏవేవో చేసేశారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాల మాయం దగ్గర్నుంచి, అమరావతి వరకు అన్ని విషయాలపైనా చంద్రబాబు ఓటర్లను నిలదీసిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘నాయకుడు ఓట్లు అడుక్కునే పద్ధతి ఇది కాదు’ అని ఓటర్లు బాహాటంగానే చంద్రబాబుని విమర్శిస్తున్నారు.. టీడీపీ నేతలకు మొహం చాటేస్తున్నారు. టీడీపీకి వేరే శతృవు అక్కర్లేదు చంద్రబాబు వుండగా. చంద్రబాబు ప్రశ్నల్లో కొంత వాస్తవం లేకపోలేదు. డబ్బులు పంచడం అనేది రాజకీయ పార్టీలు చేసే తప్పు. దానికి జనాన్ని నిందిస్తే ఎలా.?