కష్టాల్లో ఉన్నా ఒక్కసారికి సహకరించండి..ప్లీజ్ ప్లీజ్

తన పాలనపై జనాల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో చంద్రబాబునాయుడుకు ఇప్పటికి అర్ధమైంది. ఇంతకాలం తన ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఉందని కేవలం కొందరు ప్రజా ప్రతినిధులపైన మాత్రమే వ్యతిరేకత ఉందని బుకాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని మారిస్తే సరిపోతుందని చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ అసలు వ్యతిరేకతంతా తనపైనే ఉందని ఇప్పుడు అంగీకరించక తప్పలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళారు. ఆ సందర్భంగా స్ధానిక జనాలతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉందని తనకు తెలుసంటూ అంగీకరించారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందంటే రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల పరిస్దితి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విషయం ఇఫ్పటికే చాలామంది ప్రజా ప్రతినిధులకు అనుభవంలోకి వచ్చింది. చాలా సందర్భాల్లో ఎంఎల్ఏలు, మంత్రులపై చాలా నియోజకవర్గాల్లో తిరగబడుతున్నారు. అయితే, తనకున్న మీడియా బలంతో బయటపడకుండా నెట్టుకొస్తున్నారు. అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో వ్యతిరేకత ఎక్కువైపోతోంది. తాజాగా మొదలైన జన్మభూమిలో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది.

 

మిగిలిన నియోజకవర్గాల్లాగ కుప్పంలో కూడా పెరిగిపోయిన వ్యతిరేకత చంద్రబాబు దృష్టికి వచ్చింది. దాంతో వేరే దారిలేక తనపై పెరిగిపోయిన వ్యతిరేకతను అంగీకరించాల్సొచ్చింది. ఎందుకంటే, చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భంలోనే జనాలు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. గతంలో లాగ వారిని కసురుకుని నోళ్ళు మూయిస్తే లాభం లేదని అర్ధమైంది. అందుకే వ్యతిరేకతను ఒప్పేసుకున్నారు. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కాళ్ళబేరానికి దిగేశారు. కష్టాల్లో ఉన్నానని ఈసారికి సాయం చేయాలంటూ పవన్ ను వేడుకుంటున్నారు. అలాగే తన కష్టానికి తగిన కూలి ఇవ్వాల్సిందిగా ప్రజలను వేడుకుంటున్నారు. తనకిది పరీక్షా సమయం కాబట్టి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించాలంటూ పవన్ తో పాటు జనాలను వేడుకుంటున్నారు.