జగన్ కేసు NIA కి అప్పగింత పై కూడా రాజకీయాలేనా బాబూ!

 

విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాజకీయ యుద్దం ప్రారంభించిన బాబు ఈవిషయంలో కూడా అదే వైఖరిని కొనసాగిస్తున్నట్లుగా అర్థం అవుతుంది. దర్యాప్తును కేంద్రసంస్థ పరిధిలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుంది , జగన్ ని సంతృప్తి పరచడానికే ఈ చర్య  అంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమములోనే ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. శాంతి భద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని. జగన్ పై దాడి కి సంబంధించిన మంచి చెడులకు బాధ్యత కూడా బాబు గారి నాయకత్వం వహించే ప్రభుత్వంది కాదా, బాబు గారే చెప్పాలి.

జగన్ పై జరిగిన దాడిని ఖండించి దర్యాప్తు ప్రాథమిక ఆధారాలను ప్రాతిపదికన కేసుకు సంబంధించి వివరాలు ముఖ్యమంత్రి మాట్లాడి ఉంటే సమస్య పరిష్కారం జరిగి ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఘటన జరిగిన కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రి , డిజిపి లు ఇది సంచలనం కోసమని , దాడి చేసింది జగన్ అభిమానే అని , ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదని, వైఫల్యం ఉంటే దానికి కేంద్రం బాధ్యత అని ప్రకటనలు విడుదల చేశారు.

తన రాజకీయ ప్రత్యర్థి , డీజీపీ లు కేసును ప్రభావితం చేసే విధమైన ప్రకటనలు చేయడంతో వైసిపి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యప్తు సంస్థల పై సహజంగానే అపనమ్మకంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణకు డిమాండు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలోకి విచారణ వెళ్లడం జరిగింది అంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం , దానికి నాయకత్వం వహిస్తున్న బాబుగారిదే బాధ్యత.

కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి వెళితే రాష్ట్ర హక్కులు హరించినట్లేనా…

శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కీలకమైన కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరగటం సాదారణ విషయం. కీలకమైన కేసులే కాదు ప్రత్యేక సందర్భంలో కూడా సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల వినతి మేరకు గానీ , న్యాయస్థానాలు ఆదేశాల మేరకు గానీ రాష్ట్రాల పరిధిలోని అంశాలపై విచారణ జరిపిన సందర్భం మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. పరిటాల రవి హత్య కేసును చంద్రబాబు నాడు సీబీఐ దర్యాప్తుకు డిమాండు చేశారు. కారణం రవి హత్య పై వారికి అధికార పార్టీపై అనుమానం ఉన్నది. నాడు రవి హత్య పై అధికార పార్టీపై అనుమానాలు ఉన్నట్లే నేడు జగన్ పై దాడి విషయంలో కూడా వైసీపీ కి అనుమానం ఉన్నది.

ప్రతిపక్ష పార్టీ అనుమానానికి కొంత అధికార పార్టీ నేతల వ్యవహారించిన తీరు , డీజీపీ ప్రకటనలు కూడా కారణంగా చెప్పక తప్పదు. తనకు అనుమానం వచ్చినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలి అపుడు మాత్రం రాష్ట్ర హక్కులకు భంగం కలగదు. అదే ఇతరులకు అనుమానం వచ్చినపుడు కేంద్ర దర్యాప్తు కోరితే మాత్రం అది రాష్ట్ర హక్కుల ఉల్లంఘన. రాజకీయాలు చేయవచ్చును గానీ మరీ ఇంతగానా……

-ఎం. పురుషోత్తమ రెడ్డి
తిరుపతి