సిగ్గనిపిస్తోంది బాబూ… గట్టిగా తగులుకున్న ముద్రగడ!

గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనాలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా కోస్తా జిల్లాల్లో జరుగుతోన్న కాపు ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిధిగా ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కండక్ట్ చేసే ఆత్మీయ సమ్మేళనాల సంగతి చెప్పేపనేలేదు. అక్కడ ముద్రగడ సందడి మామూలుగా ఉండటం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రధానంగా చంద్రబాబుపైనా.. పిఠాపురంలో పోటీ విషయంలో పవన్ పైనా ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో మరి ముఖ్యంగా… చంద్రబాబు ఇస్తున్న హామీలపై స్పందించారు.

ఇందులో భాగంగా… రాష్ట్రంలో జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే తాము అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడమేంటి బాబూ.. మీకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేవా అంటూ ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభం… జగన్ హామీలనే తాము అమలుచేస్తామని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడటం లేదేమో గానీ.. వినడానికి మాకు మాత్రం సిగ్గనిపిస్తోంది అని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో 2014 ఎన్నికలనాడు పవన్ తో కలిసి ఇచ్చిన హామీ.. అనంతరం చేసిన మోసం మొదలైన విషయాలపైనా ముద్రగడ స్పందించారు! ఇందులో భాగంగా… 2014లో అధికార దాహంతో ఉన్న చంద్రబాబు ఆ దాహం తీర్చుకోవడానికి కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని మోసగించాడని ముద్రగడ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో… ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే.. తనకు, తన కుటుంబానికి చేయరాని పరాభవం చేశారని తెలిపారు.

ఇక ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌ కల్యాణ్‌ కూడా… ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. ఆ సమయంలో చంద్రబాబు పక్కనే ఉండి.. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా మడుగులో దాక్కున్నారని మండిపడ్డారు. పవర్‌ షేరింగ్‌ లేకుండా కేవలం 21 సీట్లకు పరిమితం అయిపోవడం చాలా దారుణమని తెలిపారు.

ఈ సందర్భంగా ఆ సీట్లు మాత్రం ఎందుకని ప్రశ్నించిన ఆయన… అవి కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. కాపులను గంప‌గుత్తగా కొనడానికి పవన్‌ కు జనరల్‌ మేనేజర్‌ పోస్టుతో పాటు మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టును కూడా చంద్రబాబు ఇచ్చేశారని ముద్రగడ తనదైన వెటకారాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా… అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలి.. కానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏంటని నిలదీశారు.