రాజకీయాల్లోకి మోహన్ బాబు… అదిరిపోయే ప్లాన్ ఇదే ..!

మంచు మోహన్ బాబు మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి  ప్రయత్నాలు ప్రారంభించాడు . గతంలో అన్న నందమూరి తారక రామారావు తో వున్న పరిచయంతో మోహన్  బాబు రాజ్య సభ సభ్యుడయ్యారు . అప్పటివరకు మోహన్ బాబుకు సినిమాలు తన విద్యా సంస్థలు తప్ప మరో వ్యాపకం లేదు . వాటిమీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు . ఎన్టీ  రామారావు  నటించిన ఎన్నో చిత్రాల్లో మోహన్ బాబు విలన్ గా నటించాడు . 1982లో తారక రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టి ఏ సినిమావారిని బొట్టు పెట్టి పిలవలేదు . తాను  ప్రజాసేవ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని , అందుకోసం సినిమా జీవితాన్ని వదిలేశానని , మీరు  మాత్రం నాతో వచ్చి ఇబ్బంది పడవద్దని రామారావు తన సహచర నటులకు స్పష్టంగా చెప్పాడు .  రామారావు కు నైతిక మద్దతు తప్ప సినిమా జీవితానికి ఎవరు గుడ్ బై చెప్పలేదు . అయితే మోహన్ బాబు మాత్రం అన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు . ఆ పరిచయంతో రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా 1993లో “మేజర్ చంద్రకాంత్ ” అనే చిత్రం నిర్మించాడు . ఈ సినిమా  సూపర్ హిట్ అయ్యింది . ఈచిత్రం శత  దినోత్సవం తిరుపతిలో జరిగింది . ఆ సభలోనే అన్న రామారావు లక్ష్మి పార్వతిని వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించాడు . దీనిని మోహన్ బాబు బాగా వాడుకున్నాడని అంటారు .

మోహన్ బాబు అంటే లక్ష్మి పార్వతికి  అభిమానం ఉండేది . ఆ అభిమానం తోనే ఆమె ద్వారా మోహన్ బాబు 1995లో రాజ్య సభ సీటు  సంపాదించాడు . అలా మోహన్ బాబు రాజకీయాల్లో కి వచ్చాడు . 1996లో అన్న ఎన్టీఆర్ చనిపోయిన తరువాత మోహన్ బాబు చంద్ర బాబు కు సన్నిహితం కావాలని చూశాడు . నిజానికి ఇద్దరిదీ చిత్తూరు జిల్లానే . కాస్త దూరపు చుట్టరికం  కూడా వుంది . అయినా చంద్ర బాబు మోహన్ బాబును దూరంగానే పెట్టాడు.**

ఇలావుండగా 2008లో మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణు వర్ధన బాబు కు సి సి రెడ్డి మనవరాలు  విరానికా రెడ్డి తో వివాహం జరిపించాడు . వారిది  ప్రేమ వివాహం. .  అలా మోహన్ బాబు డాక్టర్ వై ఎస్  రాజేశేఖర రెడ్డి కి బంధువయ్యాడు . మోహన్ బాబుకు ముగ్గురు సంతానం . మంచు లక్ష్మి , విష్ణు, మనోజ్ అందరికీ వివాహాలు చేశాడు . అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే వున్నాడు . 2015లో “మామ మంచు అల్లుడు కంచు” అనే సినిమా చేశాడు .. ఈ సినిమా ఆర్ధికంగా బాగా దెబ్బ తీసింది . మూడు సంవత్సరాల తరువాత  “గాయత్రి “అనే సినిమా నిర్మించి హీరోగా నటించాడు . ఈ సినిమా కూడా  ఊహించని పరాజయం పాలు  చేసింది . ఇక సొంత చిత్రాలు తియ్యకూడదనుకున్నాడట .అందుకే బయటి సినిమా కాబట్టి  మహానటి సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో నటించాడు . ఇప్పుడు మోహన్  బాబు దృష్టి సినిమాను దాటి రాజకీయంపై పడింది . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు తనకు సహాయం చెయ్యడు . కనీసం తనని దగ్గర కూడా చేర  నివ్వడు ,ఎంతమాత్రం  నమ్మడు . ఇక మిగిలింది . జగన్ మోహన్ రెడ్డి , ఆ కుటుంబంతో ఎలాగూ బంధుత్వం వుంది కాబట్టి , వైఎస్సార్  పార్టీ ద్వారా పార్లమెంటుకు సీటు  సంపాదించాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా  తెలుస్తుంది .

మరి ఈ పద్మశ్రీ మోహన్  బాబు కల నెరవేరుతుందో లేదో ?