అంతర్వేది ఘటన ఇప్పుడు రాజకీయనేతలు సహా ఏపీ ప్రజల్లో హాట్ టాపిక్. అసలు ఘటన ఎలా జరిగింది? ప‌్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర కోణ ముందా? ప్రమాదవశాత్తు జరిగితే దానికి కారణం ఏంటి? ఒక వేళ నిజంగా కుట్రే జరిగితే అందుకు కారకులు ఎవరు? ఇందులో ఎన్ని రాజకీయ పార్టీలున్నాయి? ఆ హస్తం అధికార పక్షానిదా? ప‌్రతి పక్షానిదా? లేక ఇతర పార్టీలదా? ఇలా ఎన్నో సందేహాలు ఏపీ ప్రజల బుర్రల్ని తొలిచేస్తున్నాయి. ఇప్పటికే అధికార -ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే కార్యక్రమం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. మీరంటే మీరంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
ఇక ఘటనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి అప్పగించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పాశవిక చర్యను ఉపేక్షించేది లేదని కేసును సీబీఐకి అప్పగించి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీఐఐసీ చైర్మన్ రోజా- చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేసారు. అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తo ఉందని ఆరోపించారు. గతంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం, రాజధాని భూముల్ని తగలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడదేనని విమర్శించారు. అప్పట్లో సీబీఐని రాష్ర్టానికి రావొద్దని జీవో ఇచ్చిన ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసారు.
అయినా చిత్తశుద్దితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేసారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చినప్పటి నుంచి టీడీపీ విమర్శలే పనిగా పెట్టకున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయన్నారు. వాటికి తగ్గట్టు పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. విశాఖలో వరుస ప్రమాదాల వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే విశాఖ, కర్నూలు ని రాజధానిగా చేయడం ఇష్టం లేని పసుపు నేతలు చేసిన రకరకాల కుట్రలను వైసీపీ భగ్నం చేసింది. మరి రోజా తాజా ఆరోపణలపై టీడీపీ నేతలు ఎలాంటి బధులిస్తారో.