మార్గదర్శి ముంచిందా… వాట్సప్ @ 9493174065!

మార్గదర్శిపై ఇప్పటివరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అయినా కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్య్యలకు దిగుతుంది.. అనేది ఇప్పటివరకూ ఆ సంస్థ యాజమాన్యం, కొంతమంది అనుంగుల మాటలు. అయితే గత ప్రభుత్వాలు మార్గదర్శి చందాదారులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. మార్గదర్శి వల్ల ఎవరికైనా సమస్య ఉంటే… వెంటనే వాట్సప్ చేయవచ్చు!

అవును… చందాదారుల సొమ్మును తన కుటుంబ సభ్యుల సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేశారనేది ప్రధాన అభియోగాల్లో ఒకటి. ఇలా ప్రజల సొమ్మును వ్యాపారాల్లో పెట్టేసి ఇప్పుడు రామోజీ­రావు ఫిల్మ్ సిటీలో తాపీగా సేద తీరుతూ… పత్రికల్లో ప్రవచనాలు వల్లిస్తున్నారు. చందాదారులు మాత్రం మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

చిట్టీలు పాడిన పాట మొత్తం సొమ్ము ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం చేస్తోన్న అరాచకం మామూలుది కాదని అంటున్నారు బాధితులు. వీరిలో కొంతమంది ఆస్తి పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు తీసుకుని కూడా డబ్బులివ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు చిట్టీలు పాడినా పాట మొత్తం ఇవ్వ­కుండా నెలల తరబడి తిప్పుతున్నారు.

ఈ సమయంలో మరింత దోపిడీ దారుళ్లా ఆలోచించి… .ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీగా చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో… చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి… చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని నెలల తరబడి జాప్యం చేస్తున్నా ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించడం లేదు!

దీంతో మార్గదర్శి ఆర్ధిక అరాచకాలు, దారుణాలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో… మోసపోయిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చందాదారులు ఫిర్యాదు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా.. చందాదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబరు (9493174065) అందుబాటులోకి తెచ్చింది.

ఈ వాట్సప్ నెంబర్ ను సీఐడీ విభాగం వెల్లడించడంతో… రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద సంఖ్యలో సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్‌ నంబర్‌ అందుబాటులోకి రాకముందు సీఐడీకి దాదాపు వందకుపైగా ఫిర్యాదులు రాగా.. ఇప్పుడు మూడు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా చందాదారులు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని తెలుస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… చందాదారుల సొమ్మును రామోజీ ఇప్పటికే తమ పేరిట స్థిర, చరాస్తులుగా మార్చేశారట. దీంతో ప్రసుత్తం చిట్టీ గ్రూపుల్లో ఉన్న దాదాపు 50 వేల మంది చందాదారులకు ప్రైజ్‌ మనీని చెల్లించలేక మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చేతులెత్తేసిందని అంటున్నారు.

ఇదే క్రమంలో… రాష్ట్రంలోని 37 బ్రాంచీల పరిధిలో దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్‌ మనీ చెల్లించడం లేదని సమాచారం. దీంతో… గత 9 నెలల్లో రూ.1,620 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించారని అంటున్నారు. మరోవైపు రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని కూడా కాలపరిమితి ముగిసినా చెల్లించడం లేదట.

ఈ స్థాయిలో బకాయిలు పెండింగ్ పడిపోవడంతో… మార్గదర్శి దివాలా అంచున ఉందని.. ఏపీ ప్రభుత్వం ఎంక్వైరీ వేసి ఉండకపోతే మార్గదర్శి డిపాజిట్ దారులు అంతా అన్ని రకాలుగానూ నష్టపోయే వారని.. కామెంట్లు వినిపిస్తున్నాయి!