పవన్ పాలిటిక్స్ పై విష్ణు వ్యాఖ్యలు… తెరపైకి కీలక విషయాలు!

ప్రముఖ సినిమా హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో తనకు రాజకీయాలపై అవగాహన లేదని అంటున్నే… ప్రస్తుత రాజకీయాలపైనా.. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ పైనా స్పందించారు!

అవును… తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు రాజకీయాలపై స్పందించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయ భవిష్యత్తుపై స్పందించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా… పవన్‌ రాజకీయాల గురించి చెప్పడానికి నేనే ఏమైనా బ్రహ్మంగారినా..? అని మొదలుపెట్టిన విష్ణు.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా… “పవన్‌ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్‌ స్టార్‌. సందేహమే లేదు. పవన్‌ కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయిన మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్‌ వస్తాయి. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను” అని అన్నారు.

ఇదే క్రమంలో… సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని గుర్తు చేసిన విష్ణు… ఒక్కోసారి పాలిటిక్స్‌ లో పేరుపొందిన లెజండరీ పర్సన్స్‌ ను కూడా ప్రజలు ఓడించారని అన్నారు. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం తాను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మోహిత్‌ చంద్రగిరిలో నిలబడబోతున్నాడని తెలుస్తోందని అన్నారు. మోహిత్‌ తనకు తమ్ముడు అని.. అతన్ని తాను చాలా అభిమానిస్తానని.. అవసరమైతే అతనికి సపోర్ట్‌ చేస్తానని విష్ణు చెప్పడం గమనార్హం.

ఇదే సమయంలో ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుందని.. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారని విష్ణు తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్‌ అనే విషయాన్ని సర్వేలు తెలుపుతున్నాయని విష్ణు అన్నారు. ఈ సందర్భంగా టైమ్స్ నౌ సర్వేను ఆయన ప్రస్థావించారు.

అనంతరం తన సినిమాలపై విష్ణు స్పందించారు. ప్రస్తుతం తన ఏకాగ్రత సినిమాలపై ఉందని పేర్కొన్నారు. భారీ బడ్జెతో “భక్త కన్నప్ప” సినిమా తీస్తున్నామని ప్రకటించారు. ఇందులో భారీగా ఆగ్ర నటులు ఉంటారని.. ఈ సినిమా కోసం తన మార్కెట్‌ కు మించి బడ్జెట్‌ పెడుతున్నామని.. మంచు విష్ణు తెలిపారు. త్వరలో దానికి సంబంధించిన విషయాలన్నీ వెల్లడవుతాయని ఆయన తెలిపారు!