‘మా’ ఎన్నికల్లో రోజా ఓటు ఏ ప్యానెల్‌కి పడుతుందో.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎవరికి ఓటు వేయబోతున్నారు.? ఈ విషయమై ఆమె స్వయంగా స్పందించారు. ‘సాధారణ ఎన్నికలు వేరు, సినిమా ఎన్నికల వేరు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరికి ఓటు వేయాలన్నది మేనిఫెస్టోలని చూసి నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పారు ఎమ్మెల్యే రోజా.

సినీ నటుడు మోహన్ బాబు 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తన కుమారుడు విష్ణుతో కలిసి వైసీపీలో చేరారు కూడా. ఆ లెక్కన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓటు ఖచ్చితంగా మంచు ప్యానెల్‌కే పడాల్సి వుంటుంది.

‘మా’ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సినీ నటుడు మంచు మనోజ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవడం, ఆ తర్వాత కొద్ది రోజులకు మంచు విష్ణు తన ప్యానెల్ ప్రకటించడం తెలిసిన సంగతులే. అయితే, మంచు కుటుంబానికీ, వైఎస్సార్ కుటుంబానికీ బంధుత్వం వుంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో రాజకీయమన్న చర్చ జరిగింది.

కానీ, వైసీపీకి ‘మా’ ఎన్నికలతో సంబంధం లేదంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రోజా ఓటు ఎవరికి పడుతుంది.? అనే సస్పెన్స్ అయితే నెలకొంది. క్రాస్ ఓటింగ్ అనే మాటకు అవకాశమివ్వకుండా, నచ్చిన ప్యానెల్‌కి ఓటేస్తానని రోజా చెప్పడం గమనించాల్సిన విషయం.