కుప్పం మున్సిపాలిటీ సంగతి మరిచిన చినబాబు!

ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారో.. లేక, ఆ మాటలకు రాబోయే కౌంటర్ల సంగతి తెలియక పలుకుతున్నారో తెలియదు కానీ.. పాదయత్రల్లో జగన్ పై లాజిక్ లేని విమర్శలు చేస్తున్నారు నారా లోకేష్. ఫలితంగా.. సోషల్ మీడియా వేదికగా ఆ విమర్శలకు అర్థవంతమైన సెటైర్లు పడుతున్నాయి. ఫలితంగా… ఆ సబ్జెక్టును సైడ్ చేస్తున్నారు తమ్ముళ్లు!

విషయానికొస్తే… లోకేష్ తాజాగా జగన్ విషయంలో ఒక డిమాండ్ చేశారు. దాన్ని, ఆయన ఛాలెంజ్ అని చెప్పుకుంటున్న సంగతి కాసేపు పక్కన పెడితే… “జగన్ తన కంచుకోట నియోజకవర్గాల్లో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదు.. గతంలో వైకాపా గెలవని చోట పోటీచేసి గెలవాలి.. ఆ సత్తా ఉందా” అని అడుగుతున్నారు. దీంతో ఇంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదేమో అనే కామెంట్లు పడుతున్నాయి.

ఎందుకంటే… ప్రస్తుతం కంచుకోటలు బద్దలైపోతున్న రోజులు వచ్చేశాయి. ఈ నియోజకవర్గంలో పలానా పార్టీకే ఓటు వేస్తారు.. ఆ నియోజకవర్గంలో మరో పార్టీకి చోటులేదు వంటి మాటలు పోయాయి. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు కూలిన టీడీపీ కంచుకోటలెన్నో చినబాబుకి తెలియంది కాదు. మహా మహా నాయకులమని చెప్పుకునేవారు.. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసినవారు.. కనుమరుగైపోయారు!

సరే కాసేపు లోకేష్ మాటే పరిగణలోకి తీసుకుంటే… కుప్పం చంద్రబాబు అడ్డా! వరుసగా ఏడుసార్లు అక్కడనుంచి చంద్రబాబు పోటీచేసి గెలిచారు. మరి అలాంటి నియోజకవర్గంలో.. గతంలో వైకాపా ఎన్నడూ గెలవని కుప్పం మునిసిపాలిటీని తాజాగా జగన్ గెలిచుకున్నారు! అంటే… టీడీపీ కంచుకోటలో జగన్ జెండా ఎగరేసినట్లే కదా! ఇంతకు మించిన ప్రూఫ్ ఏమికావాలి? పోనీ ఇది సరిపోదని నిస్సుగ్గుగా వ్యాఖ్యానించినా… ఇలాంటి ప్రూఫ్ లు ఫ్యూచర్ లో ఇవ్వాల్సిన అవసరం జగన్ కి ఉన్నా లేకున్నా… అడిగే నైతిక హక్కు మాత్రం చినబాబుకి లేదు కదా! దీంతో సోషల్ మీడియా జనాలు… చినబాబు ఫోటోలు పెట్టి మీంస్ చేసుకుంటున్నారు! కాస్త వెనకా ముందూ చూసుకుని.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని సవాళ్లు గట్రా చేయమనేది వారి సలహా!!