పవన్, చంద్రబాబును కలుపుతున్నదెవరు?

 (PK)

పవన్‌కళ్యాణ్‌ ఈ మధ్య ఓ నాలుగు రోజులు కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఎక్కడికెళ్లాడనే దానిపై చాలా ఊహాగానాలు వినిపించాయి. కానీ అసలు నిజం ఏమిటంటే ఆయన ఆ నాలుగురోజులు అమెరికాలో ఉన్నాడని అభిజ్ఞవర్గాల సమాచారం. ఏపీ రాజకీయాల్లో తాను ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై పవన్‌ అక్కడ కీలక భేటీ జరిపాడు. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, మరో కీలక వ్యక్తి ఉన్నారు. లింగమనేని రమేష్‌ ఎవరో తెలుసా?. చంద్రబాబు బినామీల్లో ఒకరు. ఉండవల్లిలోని రమేష్‌ బంగ్లాలోనే చంద్రబాబు ఇప్పుడు నివాసం ఉంటున్నాడు. ఈ రమేష్‌ బాబుకేగాదు పవన్‌కీ మాంచి మిత్రుడే.

చంద్రబాబుకి తన ఇంటిని ఇచ్చిన రమేష్‌.. మంగళగిరిలో కోట్ల విలువ చేసే తన భూమిని 20 లక్షలకే పవన్‌ ఇల్లు కట్టుకోవడానికి ఉదారంగా ఇచ్చేశాడు. దీనర్థం ఏమిటంటే బాబు, పవన్‌లిద్దరికీ లింగమనేని రమేష్‌ బాగా కావల్సిన మనిషి. అలాంటి రమేష్‌కు ఆప్త మిత్రుడు నాదెండ్ల మనోహర్‌. 

అమెరికాలో జరిగిన భేటీలో ఇదే రమేష్, తన మిత్రుడు మనోహర్‌తో కలిసి పవన్‌తో కొన్ని కీలకమైన అంశాలపై డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అది ఎవరికోసమో కాదు చంద్రబాబు కోసమే. అక్కడే పవన్‌ను అన్ని రకాలుగా రమేష్‌ ఖుషీ చేశాడు. తాను అమెరికా వెళ్లిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం మొదట ముంబయి వెళ్లి అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లాడు పవన్‌. తిరిగి ముంబయ్‌ రాకుండా చెన్నయ్‌ వచ్చి అక్కడ అభిమానులతో కార్యక్రమాలు చేసి ఏపీలోకి అడుగుపెట్టాడు.

 

ఈ భేటీ జరిపిన తర్వాతే జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టాడు. అంతకుముందు వరకూ చంద్రబాబునే టార్గెట్‌ చేసినా, హఠాత్తుగా జగన్‌పై గాలి మరలడానికి ఈ భేటీయే కారణం. అక్కడ కుదిరిన డీల్‌లో భాగంగానే తన స్వరాన్ని మార్చి జగన్‌పై రోజురోజుకూ విమర్శల దాడి పెంచుతున్నాడు. ఈ విషయం తెలిసే శ్రీకాకుళం జిల్లా రాజాం సభలో జగన్, ఆసక్తికర కామెంట్లు చేశాడు. పవన్‌ చూపిస్తున్న సినిమాలో ఆయన కేవలం నటుడు మాత్రమేనని, దర్శకుడు చంద్రబాబైతే నిర్మాత లింగమనేని రమేష్‌ అని విరుచుకుపడ్డాడు. 

దీన్నిబట్టి పవన్‌ నెమ్మదిగా మళ్లీ చంద్రబాబు ట్రాప్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది.  అయితే ఈసారి నేరుగా బాబుతో పొత్తు పెట్టుకోకుండా తెరవెనుక లోపాయకారీగా సహకరిస్తాడట. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బాబుకు మేలు చేయడంతోపాటు తానూ 20 నుంచి 25 సీట్లు గెలుచుకోవచ్చనేది పవన్‌ అభిమతం. ఇది కూడా చంద్రబాబు ద్వారా లింగమనేని కల్పించిన ఆశే. ఈ సీట్లతో కర్నాటకలో కుమారస్వామిలా సీఎం అయ్యే ఛాన్స్‌ కూడా ఉంటుందని పవన్‌కు గట్టిగా బ్రెయిన్‌వాష్‌ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. పవన్‌ తన చేయి దాటిపోకుండా ఉండేందుకు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌ను అత్యంత చాకచక్యంగా ఆయన వద్దకు చేర్చి లింగమనేని ద్వారా కథ నడిపిస్తున్నాడనేది సారాంశం. అయితే పవన్‌పై వేరే ఒత్తిడులు కూడా పనిచేస్తుండడంతో అప్పుడప్పుడూ డైలాగులు అటూఇటూ మారుతున్నాయి. ఇప్పటికైతే ఈ లైన్‌లోనే ఉన్న పవన్‌ తర్వాత బీజేపీ లైనులోకి మారతాడో, లేక ఇదే లైనులో కంటిన్యూ అవుతాడో వేచిచూడాలి.