ఆ మూడు సీట్లలో కాంగ్రెస్, టిడిపి ఫ్రెండ్లీ కాంటెస్ట్

మహా కూటమి పొత్తు ఇంకా మరింత ఝటిలంగా మారుతున్నది. సీట్ల కిరికిరి తేలక పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఇంకోవైుప ఫీల్డులో టిఆర్ఎస్ దూసుకుపోతున్నది. బ్యాటింగ్, బౌలింగ్ ఆ ఒక్క పార్టే చేస్తూ హల్ చల్ చేస్తున్నది. కానీ కూటమి పార్టీల్లో మాత్రం సీట్ల లెక్క తేలకపోవడం కలవరం రేపుతున్నది. క్షణ క్షణం సీట్లు మారిపోతూ టెన్షన్ రేకెత్తిస్తున్నది.

ఈ పరిస్థితుల్లో మహా కూటమి సీట్ల లెక్కలు తేలకపోవడం, అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో కూటమిలో కొత్త గుబులు మొదలైంది. అయితే కూటమి పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్న చోట ఒకరినే ఎంపిక చేయడం కష్టసాధ్యమైతున్నది. దీంతో ఫ్రెండ్లీ కాంటెస్ట్ వైపు కూటమి పార్టీల అడుగులు పడుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణ జన సమితికి, కాంగ్రెస్ కు మధ్య రెండు సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు దిగుదామని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణ జన సమితి 9 స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తుండగా మరో రెండు స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ ఫైట్ కు దిగనున్నది. 

ఈ పరిస్థితుల్లో టిడిపి, కాంగ్రెస్ మధ్య కూడా ఫ్రెండ్ల ీఫైట్ తప్పేలా లేదు. హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, పటాన్ చెరు, జూబ్లీహిల్స్ స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ తప్పేలా లేదని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మూడు సీట్లలో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు ఉన్నారని, టిడిపికి కూడా బలమైన క్యాండెట్స్ ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మూడు సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ తప్పదేమో అని ఒక టిడిపి నేత తెలిపారు. అయితే ఈ మూడు సీట్లలో కాంగ్రెస్ చేయి గుర్తు, టిడిపి సైకిల్ గుర్తు బ్యాలెట్ మీద ఉండబోతున్నాయి.

ఈ విషయంలో కాంగ్రెస్ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సీట్లలో కాకుండా ఐదు సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేద్దామంటూ కాంగ్రెస్ టిడిపి నేతలకు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థిత చూస్తే ఈ ఐదు, టిజెఎస్ తో కలిసి మరో రెండు మొత్తం 7 సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ తప్పేలా లేదని టాక్ వినబడుతున్నది. ఇక సిపిఐ పొత్తు గురించి ఇంకా క్లారిటీ రాలేదు. చివరి నిమిషంలో సిపిఐ కి మూడు సీట్లు ఇచ్చి మరో రెండు సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఒక కాంగ్రెస్ నేత తెలిపారు. 

ఎల్బీ నగర్  నీకా ? నాకా ?

తాజా సమాచారం ప్రకారం ఎల్బీ నగర్ లో టిడిపి బలంగా ఉంది. ఈ సీటును టిడిపి తమకే కావాలని గట్టిగా కోరుతున్నది. సామ రంగారెడ్డి ఈ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఒక దశలో ఎన్టీఆర్ భవన్ ముందు తన అనుచరగణంతో వచ్చి ధర్నా కూడా చేశారు. మరోరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సుధీర్ రెడ్డికి కూటమి టికెట్ ఇవ్వొద్దంటూ పట్టుపడుతున్నారు. సుధీర్ రెడ్డి గతంలో మూడో స్థానానికి పరిమితమైనట్లు చెబుతున్నారు. అయితే సుధీర్ రెడ్డికి ఇఫ్పుడు గ్రాఫ్ బాగా పెరిగిందని, కాంగ్రెస్ చేయించిన సర్వేలను బట్టి ఆయనకు విజయావకాశాలున్నాయని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్రెండ్లీ ఫైట్ తప్పేలా లేదు.

జూబ్లి హిల్స్ సీటు ఇవ్వాలని బాబును కోరిన అనూష రాం

ఇక జూబ్లీహిల్స్ లో టిడిపికి బలమైన నేతలు ఉండగా, కాంగ్రెస్ కు ఉన్నారు. ఇక్కడ కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పేలా లేదని తెలుస్తోంది. టిడిపి సీటులో ఆ పార్టీ మహిళా నేత ఉప్పలపాటి అనూష రాం బరిలో ఉన్నారు. ఆమె ఓసి, బిసి కోటాతో పాటు మహిళా కోటాలో తనకే సీటు ఇవ్వాలని అధిష్టానం మీద వత్తిడి తెస్తున్నారు. ఆమె పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా ఆమె భర్త కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వారి ఫ్యామిలీ అంతా టిడిపిలోనే ఉందని చెబుతున్నారు. టిడిపి పోటీ చేస్తున్న 14 నియోజకవర్గాల్లో ఒక్క మహిళకు కూడా సీటు ఇవ్వరా అని ఆమె సమీకరణాలను తెరమీదకు తెస్తున్నారు.

ఇదే సీటులో కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రదీప్ చౌదరి కూడా రేస్ లో ఉన్నారు. ఇక జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి దివంగత నేత పిజెఆర్ కుమారుడు విష్ణు బరిలో ఉన్నారు. విష్ణు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 

పటాన్ చెరు పై పీటముడి

పటాన్ చెరులో ఇటీవల బిజెపి నుంచి నందీశ్వర్ గౌడ్ టిడిపిలో చేరారు. బిసి కోటాలో ఆయన పటాన్ చెరు టికెట్ ఆశిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి చాలా మంది పోటీలో ఉన్నారు. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గాలి అనీల్ కుమార్ రేస్ లో ఉన్నారు. ఈయనకు పిసిసి చీఫ్ ఆశిస్సులు ఉన్నాయి. అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ అనే నేత కూడా బరిలో ఉన్నారు. ఈయనకు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ్మ ఆశిస్సులు ఉన్నాయి. అలాగే కొలన్ బాల్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. 

ఈ సీట్లే కాకుండా ఫ్రెండ్లీ కాంటెస్ట్ సీట్ల సంఖ్య మరింతగా పెరిగి కూటమి స్పూర్తి దెబ్బ తినే పరిణామాలు కనబడుతున్నాయని ఆయా పార్టీల్లో నేతల మాటల్లో ఆందోళన కనబడుతున్నది.