నాయుడూ వద్దు, జగనూ వద్దు, మాదిగల ఓటు నోటాకే

నోటాకు వోటేయండని ఎవరూ సాధారణంగా ప్రచారం చేయరు.అయితే ఎమ్ ఆర్ పి ఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ మాత్రం నోటా ( none of the above) క్యాంపెయిన్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి వోటేయకండి, ప్రతిపక్ష వైసిపికి ఓటేయవద్దు, నోటా బటన్ నొక్కి మీ శక్తి నిరూపించడండని ఆయన  ఆంధ్రప్రదేశ్ మాదిగలకు పిలుపు నిస్తున్నారు.

ఆయన ఈ రోజు విజయవాడలో మాట్లాడారు. 

జనవరి లో శ్రీకాకుళం ల నుంచి ఆయన ఈ ప్రచార యాత్ర ప్రారంభించారు.  ఈ రోజుకు  72 రోజుల పాటు పర్యటించి విజయవాడకు చేరుకున్నారు. 

‘ఈ ఎన్నికలలో టిడిపి కి ఓట్లు వేయకుండా ఓడించాలి.చంద్రబాబు దళితులను మోసం చేశారు, ఆయన వల్ల అణచివేత కు గురయ్యాం, ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మోసం మా కళ్లల్లో మెదులుతూ ఉంది. అదే విధంగా సమస్యల పై స్పందించని ప్రతిపక్ష పార్టీకి కూడా ఎవ్వరూ ఓటు వేయవద్దు.  మేము ఎన్ని ఇబ్బందులు పడినా ప్రతిపక్షనేత జగన్  కూడా ఏనాడూ మాకు అండగా లేడు,’ అని ఆయన చెప్పారు.

‘వాళ్లిద్దరి పై విశ్వాసం లేనందున నోటా కే ఓటు ‌చేయాలని మా సోదరులను కోరుతున్నాను.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే డబ్బు కు లొంగొద్దు. మాదిగల ఆత్మగౌరవాన్ని చాటి‌చెప్పేందుకే నోటాకు ఓటు‌వేయాలి.’ అని ఆయన స్పష్టంగా చెప్పారు.

గత ఎన్నికలలో చంద్రబాబు ను నమ్మి మద్దతు ఇచ్చామని అంటూ వర్గీకరణ కోసం పోరాడి పెద్ద మాదిగ అవుతా అన్న చంద్రబాబు మాటనుగుర్తు చేస్తూ చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు.

ఆయన హయాంలో అసెంబ్లీ లో వర్గీకరణ కు తీర్మానం కూడా చేయలేదు. సరిగదా, న్యాయమైన డిమాండ్ ల కోసం పోరాటం‌ చేస్తే అరెస్టు లు చేయించారు. అమరావతి లో విశ్వరూప మహాసభ పెడితెే అడ్డుకున్నారు. మాదిగల సహకారం తో గెలిచిన చంద్రబాబు మాదిగలమీదే  దాడులు‌ చేయించారు,’ అని అన్నారు.

చంద్రబాబు ను ఓడించేందుకు ప్రచారం చేసిన జూపూడి, కారెం‌ శివాజీలకు ఆయన పెద్ద పీట వేశారని కృష్ణ మాదిగపేర్కొ్నారు.

అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబు, మాదిగల కష్టాలు పట్టించుకోని జగన్ లకు ఓట్లు వేయకుండా, నోటా కే వేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.