రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం

రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందా? ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఐటి, ఈడీ సోదాలు నిర్వహిస్తోెంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు  తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఏక కాలంలో 15 ప్రాంతాలలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో ఓటుకు నోటు  కేసులో కూడా రేవంత్ అరెస్టయ్యి జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఇప్పుడు కూడా అధికారులు అరెస్టుచేసి రేవంత్ ను జైలుకు పంపుతారని పలువురు నేతలు అంటున్నారు. 

రేవంత్ అరెస్టుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ నివాసంతో పాటు 15 ప్రాంతాలలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచే రేవంత్ కొడంగల్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రేవంత్ ఇళ్లలో ఐటి అధికారులతో పాటు ఈడి అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సోదాలు నిర్వహిస్తున్న అధికారులు రేవంత్ కు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని కోరారు. దీంతో రేవంత్ రాత్రి వరకు హైదరాబాద్ వస్తానని వారికి తెలిపారు.

రేవంత్ నివాసం వద్ద పోలీసులు అరెస్టు వారెంట్ తో సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ హైదరాబాద్ రాగానే ఆయనను అరెస్టు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఓటుకు  నోటు కేసు కూడా మళ్లీ తెరపైకి తెస్తారనే వార్తలు వస్తున్నాయి.

రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మోడీ కేడీలు కలిసి తనను మళ్లీ జైలుకు పంపేందుకు సిద్దమయ్యారని అంతా మంచిగుంటే మళ్లీ వస్తా లేకుంటే జైలు నుంచే నామినేషన్ పత్రాలు పంపుతా.. మీరే అంతా చూసుకోవాలి, నన్ను గెలిపించాలి అంటూ కొడంగల్ ప్రచారంలో రేవంత్ ప్రసంగించారు. దీంతో రేవంత్ అరెస్టు తప్పదనే వార్తలు స్పష్టమవుతున్నాయి.

రేవంత్ రెడ్డి పై ఫెమా,  మనీలాండరింగ్ చట్టాలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు కొండగల్ తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 ఫిబ్రవరి 25 న రఘువరన్ మురళి బ్యాంక్ నుంచి ఒకే రోజున 9 కోట్ల రూపాయలు రేవంత్ అకౌంట్ లో జమ అయినట్టు అధికారులు గుర్తించారు.

రేవంత్ తన వియ్యంకుడు వెంకట్ రెడ్డి కి 60 లక్షల మలేషియన్ రింగేట్స్ బదిలీ చేశారు. 20 ఏళ్లుగా రేవంత్ కు వెంకట్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకట్ రెడ్డి నెక్సెస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు నిర్వహిస్తున్నారు.