ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలపై చంద్రబాబునాయుడుకు కెసియార్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కెసియార్ అడ్డుపడుతున్నారని, ప్రత్యేకహోదాకు అనుకూలమని కెసియార్ తో జగన్మోహన్ రెడ్డి చెప్పించగలరా అంటూ చంద్రబాబు పదే పదే సవాలు విసురుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
తాను అధికారంలోకి వస్తే కెసియార్ ను కూడా ఒప్పించి ప్రత్యేకహోదాను సాధిస్తానని జగన్ రోడ్డుషోల్లో చెబుతున్నారు. దాన్ని చంద్రబాబు అండ్ కో ఎద్దేవా చేస్తున్నారు. అసలు ప్రత్యేకహోదాకు అడ్డంకే కెసియార్ అన్నట్లుగా చంద్రబాబు అండ్ కో మాట్లాడుతున్నారు. దానికి జవాబుగానా అన్నట్లుగా వికారాబాద్ లో జరిగిన బహిరంగసభలో కెసియార్ మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేది జగనే అంటూ కెసియార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అదే సమయంలో ఏపికి ప్రత్యేకహోదాకు తాము మద్దతిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభలో కెసియార్ ప్రత్యేకహోదా, పోలవరంకు మద్దతు పలకటంతో చంద్రబాబు అండ్ కో కు దిమ్మతిరిగినట్లైంది. పైగా అదే బహిరంగసభలో చంద్రబాబు నైజాన్ని కెసియార్ దుమ్ముదిలిపేశారు.
నిజానికి చాలా రోజులుగా ఏపి రాజకీయాల గురించి కెసియార్ ఎక్కడా మాట్లాడటం లేదు. అలాంటిది పోలింగ్ మరో రెండు రోజుల్లో మొదలవుతుందనగా హఠాత్తుగా ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణాలపై కీలక ప్రకటన చేయటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుండటం గమనార్హం. కెసియార్ ప్రకటన చూస్తే జగన్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పినట్లుగా ఉంది.