కారుమూరి కాటు.! వైసీపీకి వేరే శతృవులు అక్కర్లేదు.!

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా వైసీపీ మీద ‘విషపు కాటు’ వేసేశారు.! అసలేమయ్యింది ఈ వైసీపీ నేతలకి.? అందునా, కీలక పదవుల్లో వున్న నేతలెందుకిలా సంయమనం కోల్పోతున్నారు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ అంటున్నారు.! కానీ, వైసీపీ నేతలు.. అందునా, మంత్రులేమో, ‘వై నాట్ బూతులు’ అంటున్నారు.! ఎక్కడ జరుగుతోంది లోపం.? ఎందుకు వైసీపీ ఇంతలా మునిగిపోతోంది పాపం.?

అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సొంత పార్టీ నాయకుల్ని.. అందునా, మంత్రుల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. కాదు కాదు, ముఖ్యమంత్రే బూతులు మాట్లాడమని మంత్రుల్ని ఎగదోస్తున్నారన్నదీ ఓ అనుమానం.!

ఏది నిజం.? ఏది వాస్తవం.? తన వద్ద గోడు వెల్లబోసుకునేందుకు వచ్చిన రైతుల్ని ఉద్దేశించి, ‘ఎర్రి పప్పా’ అంటూ విరుచుకుపడిపోయారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అదెంత ‘బూతు’ అన్నది అందరికీ తెలిసిన విషయమే.

కానీ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాత్రం ఆ ‘ఎర్రి పప్ప’ అనే బూతుకి, గొప్ప అర్థాన్ని వెతికి పట్టుకున్నారు. ‘ఎర్రి పప్పా’ అంటే, ‘బుజ్జి నాన్నా’ అని అర్థమట. అంటే, మంత్రులు మరీ ఇంత అజ్ఞానులా.? మంత్రులే ఇలా వుంటే, ముఖ్యమంత్రి సంగతేంటి.? అని జనం చర్చించుకోకుండా వుంటారా.?

పొరపాటున ఆ మాట వచ్చేసిందని పేర్కొంటూ క్షమాపణ చెబితే పోయేదానికి.. కొత్త అర్థాలు తీసి, పార్టీని ఇంకా నాశనం చేసేశారు కారుమూరి నాగేశ్వరరావు.