కన్నా ఎపిసోడ్.! తృటిలో తప్పించుకున్న జనసేన.!

జనసేన పార్టీలో చేరాల్సిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనూహ్యంగా టీడీపీలోకి ఎందుకు దూకేశారు.? ఒకప్పుడు తనను చంద్రబాబు చంపాలనుకున్నారంటూ ఆరోపించిన కన్నా లక్ష్మినారాయణ, ఆ చంద్రబాబునే ‘సమర్థ నాయకుడిగా’ ఎలా గుర్తించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి.. వయా బీజేపీ.. ఈ ప్రయాణంలో కన్నా లక్ష్మినారాయణ వేసిన రాజకీయ వేషాలు అన్నీ ఇన్నీ కావు. ‘ఏ పార్టీలో వున్నా చిత్తశుద్ధితో పని చేశా..’ అంటారుగానీ, కాంగ్రెస్ నుంచి బీజేపీ.. ఇలా ఆయా పార్టీల్లో కన్నా లక్ష్మినారాయణ చేసిన రాజకీయమేంటో, రేపిన కుంపట్లు ఏంటో  అందరికీ తెలిసినవే.

ఇక, జనసేన పార్టీ అయితే కన్నా లక్ష్మినారాయణ విషయంలో ‘హమ్మయ్యా..’ అనుకుంటోంది. నాదెండ్ల మనోహర్‌తో సమానంగా.. ఆ మాటకొస్తే, అంతకన్నా బలమైన స్థానం కావాలనుకున్నారట జనసేనలో కన్నా లక్ష్మినారాయణ. కానీ, అందుకు జనసేనాని సుముఖత వ్యక్తం చేయలేదట. అద్గదీ అసలు సంగతి.!

ఇంతకీ, టీడీపీలో కన్నా లక్ష్మినారాయణ పరిస్థితేంటి.? ‘కష్టం, ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో వుంటారో.. వైసీపీలో చేరతారో..’ అంటూ అప్పుడే టీడీపీ శ్రేణులు, కన్నా లక్ష్మినారాయణకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లేస్తున్నారు. కాగా, కన్నా వెంట టీడీపీలోకి వెళ్ళే క్రమంలో ఆయన మద్దతుదారులు కొందరు.. అటు వైసీపీలోకి, ఇటు జనసేనలోకీ వెళుతున్నారట. ఇదీ ట్విస్ట్ అంటే. అన్నట్టు, కన్నా లక్ష్మినారాయణ వైసీపీ వైపు కూడా చూసినా, ఆయన్ని వైసీపీలో ఎవరూ పట్టించుకోలేదట.