టీడీపీ, వైసీపీలో టెన్షన్: ఆమె రాకతో ఏ నేతకి ముప్పు?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీల్లో నేతల మార్పులు, చేర్పులు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆమె రాకతో ఇటు టీడీపీలోని, ప్రతిపక్ష పార్టీ వైసీపీలోనూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ నియోజకవర్గం టికెట్ మీద ఆశలు పెట్టుకున్న గంజి చిరంజీవికి టికెట్ గల్లంతేనా? ఆమెకు టికెట్ ఇస్తే రానున్న ఎన్నికల్లో ప్రస్తుత మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న స్టోరీ చదవండి.

మంగళగిరిలో టీడీపీ పరిస్థితి ఏమిటి?

స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తరువాత 1983 లోను ఆ తర్వాత 1985 లోను మంగళగిరిలో టీడీపీ ఎన్నికయ్యింది. 1989 నుండి 2009 వరకు నాలుగు సార్లు కాంగ్రెస్ ఎదుట పరాజయం పాలయ్యింది. 1994 లో టీడీపీ, సిపిఎం పొత్తులో భాగంగా సిపిఎం గెలిచింది. ఇక గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణ రెడ్డి టీడీపీ నేత గంజి చిరంజీవిపై గెలుపొందారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన కారణంగా గంజి చిరంజీవిపైన ప్రజల్లో సానుభూతి ఉంది.

కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి వైసీపీని బలోపేతం చేస్తూ, టీడీపీకి వ్యతిరేకంగా పలు కేసులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఆళ్ళ కూడా తన ఇమేజ్ ని పెంచుకున్నారు. అయితే అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉన్నా అది అధికార ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష అని గట్టిగ వాదిస్తారు ఆళ్ళ. నిజానికి 2014 ఎన్నికల ముందు వరకు ఆళ్ళ అంత పాపులర్ కాదు. కానీ ఆయన టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల వలనే అటు పార్టీలోనూ, జనాల్లోనూ గుర్తింపు సాధించారు అంటారు చాలామంది. ఈసారి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచే అవకాశం ఉందని ఎక్కువగా వినిపిస్తున్న వాదన.

మరి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఉండగా గెలిచిన టీడీపీ… ఇప్పటివరకు మంగళగిరిలో బలమైన పాగా వేయలేకపోయింది. పార్టీని బలపరచడంలో గంజి చిరంజీవి కూడా విఫలమయ్యారు అనే విమర్శ ఉంది. మరి రాజధాని పరిధిలో ఉన్న నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవడం టీడీపీకి అవసరం కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే గత కొంతకాలంగా అక్కడ బలమైన అభ్యర్థి నిలబెట్టడం కోసం ఎదురు చూస్తున్నట్టు టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన కాండ్రు కమలకి అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు కొందరు నేతలు.

ఆమె తన వియ్యంకుడు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతురావుతో కలిసి బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిపారు. కమల తనకు పార్టీలో తగిన స్థానం కల్పించాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. తగిన గౌరవం కల్పిస్తానని హామీ ఇచ్చిన ఆయన మంచి రోజు చూసుకుని పార్టీలో చేరమని సూచించారు. ఈ తరుణంలోనే ఆమెకు మంగళగిరి టికెట్ ఇస్తారని వార్తలు వెల్లువెత్తాయి. ఇక ఈమెకు టికెట్ ఇస్తే గంజి చిరంజీవికి మరొక నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారా? లేక మరేదైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది సస్పెన్స్ లో పడింది.

కాండ్రు కమల

ఆమెకు టికెట్ ఇస్తే టీడీపీ, వైసీపీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండొచ్చు?

మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ఓటర్ల సంఖ్య 2 లక్షల 40 వేలు. ఆధిక్యంలో మొదట ఎస్సి ఓటర్లు ఉండగా తర్వాత స్థానాల్లో పద్మశాలి, యాదవ, గౌడ్, కాపు, కమ్మ, ఇతర కులస్థులు ఉన్నారు. ఇక్కడ గెలుపోటములపై ప్రభావం చూపేది బీసీ వర్గం. కాండ్రు కమల బీసీ వర్గానికి చెందిన పద్మశాలి కావడం పార్టీకి ప్లస్ అయ్యే అంశం. రాష్ట్రంలోనే అత్యధికంగా పద్మశాలీలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు. వీరి కుటుంబానికి నియోజకవర్గంలో పట్టు కూడా ఉంది. ఎందుకంటే కమల ఒకసారి, ఆమె వియ్యంకుడు మురుగుడు హనుమంతురావు రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఈ తరుణంలో ఆమె మంగళగిరి నుండి బరిలోకి దిగితే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా బలమైన పోటీ ఇవ్వగలరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఆమె ఎంట్రీతో ఇటు టీడీపీ నేత గంజి చిరంజీవికి, అటు వైసీపీ నేత ఆళ్ళ ఇద్దరికీ తిప్పలు తప్పేలా లేవు అంటున్నాయి రాజకీయ వర్గాలు.