సేద్యం నుంచి స్టేజ్ మీదికి… కడప రైతు విజయ యాత్ర

 (యనమల నాగిరెడ్డి)

రైతు కుటుంబంలో పుట్టి, ఉద్యోగం చేసి అందులో పస లేదని, వ్యవసాయం వైపు మళ్ళి, తనదైన శైలిలో వ్యవసాయం చేసి, నోరులేని జంతువులను ప్రేమతో ఆడుకుంటూ, తన కళా తృష్ణను తీర్చుకుంటున్న ఓ ప్రకృతి ప్రేమికుడి కథ ఇది.

కడపజిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న మారుమూల పల్లె “గంగారాంపల్లె”. ఈ పల్లెలో నేటికి ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఓ రైతు కుటుంబంలో చెన్నారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పుట్టిన చెన్నకృష్ణారెడ్డి నేటి మన హీరో.

వీరి పూర్వీకులు అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రిమాను సమీపంలోని పెడకంటి కొత్తపల్లిలో ఉండేవారు. 1996లో కుటుంబ తగాదాల వల్ల  తమ అమ్మమ్మ గారి ఊరు గంగారం పల్లె చేరుకున్నారు. ఆ రోజుకు వీరి ఆస్తి రెండెకరాలపాలం, 80 వేల అప్పు.

చెన్నకృష్ణారెడ్డి పులివెందులలో 1996-2001 మధ్య డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తి ఐన వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిగా రెండు సంవత్సరాల పాటు పని చేశారు.  ఉద్యోగం వదలి 2003లో వైస్సార్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన కిష్టమైన వ్యవసాయం వృత్తిగా చేపట్టారు.

వ్యవసాయంలో ఉండే ఇబ్బందులెదుర్కొంటూనే 2007లో తన కిష్టమైన పశుపోషణను ప్రారంభించారు. అందరిలాగా పాల వ్యాపారం చేయకుండా ప్రఖ్యాతి చెందిన దేశీ ఆవుల రకాలను తెచ్చి ఆ ఆవుల జాతిని పెంచి ఆవుదూడలను,కోడెదూడలను అమ్మడం ప్రారంభించారు.  చెన్నకృష్ణారెడ్డి 2007 లో 70 ఆవులతో గోశాలను ప్రారంభించి 2013నాటికి 300 ఆవుల కు చేర్చారు. కృత్రిమ గర్భధారణ పద్దతుల ద్వారా ఒంగోలు, బ్రెజిల్ జాతి బ్రీడ్ లను తన గోశాలలో ఉత్పత్తి చేసిన ఆయన 130 కోడెదూడలను బండలాగుడు పందెం ఎద్దులుగా తయారుచేసి భారీ ధరలకు అమ్మారు.  జత కోడెల ధర 9 లక్షల వరకు పలికిందని ఆయన గర్వంగా చెపుతారు.

తన పశువులశాలలోని ఆవులనుండి తానెప్పుడూ పాలు తీసేవారం కాదని, దూడలకు ఆరు నెలల వరకు పాలు వదలివేసేవారమని, ఆ తర్వాత ఆవులకు కృత్రిమ గర్భధారణ చేయిన్చేవాడినని చెప్పారు.

16 సంవత్సరాలుగా కోతులకు మేత

ఈ దశలో 2002 నుండి  తాను “గండి ఆంజనేయస్వామి ఆలయానికి” వెళ్ళేవాడినని, అక్కడికి సమీపంలోని కొండలలో నివాసం ఉంటున్న యోగి శ్రీ రామానంద స్వామి పరిచయంతో తన జీవన విధానం పూర్తిగా మారిందని రెడ్డి చెప్పారు.

అప్పటి నుండి తనకు జంతు ప్రేమ, ప్రకృతిని  ప్రేమించడం అలవాటైందని ఆయన తెలిపారు. ప్రతి శనివారం తాను అక్కడ 12 మంది మిత్రులతో కలసి భజనలు చేయడం, స్వామీ కుటీరంలో నెలకు 1000నుండి1200 మందికి అన్నదానము చేయడానికి అవసరమైన సంబారాలు సమకూర్చడం చేస్తున్నామని ఆయన వివరించారు.

అలాగే 2002 నుండి ప్రతి శనివారం  రామానంద స్వామి ఆశ్రమం సమీపంలో నివసిస్తున్నసుమారు 100  కోతులు, గండంగులకు అరటి, బత్తాయి, చీని లాంటి రకాల పండ్లను అందిస్తున్నామని ఆయన వివరించారు. వీటికి  ప్రతివారం 3000 వరకు పండ్లు ఆహారంగా అవసరం అవుతాయని, ఈ పండ్లను శనివారం ఆశ్రమానికి ఖచ్చితంగా చేరుస్తామని ఆయన చెప్పారు. వోక్కక్క కోతి / గండంగికి 5 నుండి 6 పండ్లు రోజుకు అవసరము కాగలవన్నారు.  శనివారం, ఆదివారం తామే స్వయంగా ఆ జంతువులకు ఆహారం అందిస్తామని, ఆతర్వాత అక్కడవున్న స్వామివారి శిష్యులు కోతుల సంరక్షణ చూస్తారని ఆయన వివరించారు. కోతులకు ఆహారం అందించడంలో పండ్ల మండీ వ్యాపారులు, రైతులు తమకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు.

గతంలో ఇక్కడ దండిగా కోతులు/గండాంగులు ఉండేవని, వేటగాళ్లు అనేకం పట్టుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2009-2011 మధ్యలో ‘ఆర్.కె. పోలీస్ స్టేషన్’ ఎస్. ఐ నాగరాజు అయన సిబ్బంది సహకారంతో వేటగాళ్లను అదుపుచేసి వీటిని సంరక్షించామని ఆయన వివరించారు. ప్రస్తుతం వేటగాళ్లు కూడా తగ్గిపోయారని అన్నారు.

2014 నుండి నాటక రంగం వైపు

2014 నాటికి ఆర్థికంగా, వ్యవసాయపరంగా, పశుపోషణ రంగాలలో కుదురుకున్న చెన్నకృష్ణారెడ్డి నాటక రంగం వైపు దృష్టి మళ్లించారు. సురభి సెట్టింగ్స్ వారి సహకారంతో రంగం సిద్ధం చేయడం తన మిత్రులతో కలసి నాటకాలు వేయడం హాబీగా మారిందని ఆయన చెప్పారు. కృష్ణ రాయభారం, కృష్ణ తులాభారం, ద్రౌపది మానభంగం, లాంటి అనేక నాటకాలు వేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం బిడ్డల చదువులకోసం కడపలో ఉంటున్నా ఈ వ్యాపకాలన్నింటిలో చురుకుగా పాల్గొంటున్నానని తన శక్తీ మేరకు మూగజీవాలకు, సహచర ప్రాణులకు సీవ చేయడం, తానూ పుట్టిన రాయలసీమకు తనవంతు సేవ చేయాలన్నది తన ద్యేయమని ఆ రైతు బిడ్డ చెన్నకృష్ణారెడ్డి “తెలుగు రాజ్యం’ ప్రతినిధికి తెలిపారు