కుక్క కాటుకి చెప్పు దెబ్బ.! అని పెద్దలు ఊరకనే అన్లేదు. అవతలి వ్యక్తి నోరు పెగలకపోతే.. నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటారు కొందరు. అట్నుంచి గట్టిగా కౌంటర్ ఎటాక్ వస్తే మాత్రం నోరు పెగలదు.! సరే, అసలు విషయానికొస్తే, రాజకీయాల్లో కిలారి ఆనంద్ పాల్ ఒకింత వెరైటీ క్యారెక్టర్. కొన్ని సందర్భాల్లో కమెడియన్‌లా కనిపిస్తాడాయన. ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తోన్న చాలామంది కమెడియన్లతో పోల్చితే, ఆయన బెటర్. రాజకీయాల్లో గెలవడమే ఘనత.. అనుకుంటారు కొందరు. అది వేరే సంగతి.
తాజాగా, కిలారి ఆనంద్ పాల్ పేరు ప్రస్తావించారు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. అదీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో రోజా, కేఏ పాల్ పేరుని ప్రస్తావించడం జరిగింది. కిలారి ఆనంద్ పాల్‌కి ఎక్కడో కాలింది.! మామూలుగా కాలలేదు, విపరీతమైన స్థాయి మంట పుట్టినట్లుంది. ‘పందిలా తింటాదేమో.. పిచ్చి కుక్కలా అరుస్తోంది..’ అంటూ రోజా మీద విరుచుకుపడిపోయారు కేఏ పాల్. ‘కొడాలి నాని మీదా కేఏ పాల్ చెలరేగిపోయారు. కేఏ పాల్ ఎవర్నయినా చాలా తేలిగ్గానే విమర్శించేస్తారు.. అది ఆయనలోని చాలా స్పెషల్ క్వాలిటీస్‌లో ఒకటని అనుకోవాలేమో.!
రాజకీయాల్లో కమెడియన్ అయిపోయాడేమోగానీ.. కిలారి ఆనంద్ పాల్ అంటే ఒకప్పుడు.. దేశ విదేశాల్లో బోల్డంత ఫాలోయింగ్ వున్న క్రైస్తవ మత ప్రచారకుడు. ప్రధానులు, ముఖ్యమంత్రులు.. ఆయన వద్ద ఆశీస్సులు పొందినవారే. అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి వేరనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, రాజకీయ రంగంలో రోజా చాలా చాలా విమర్శలు ఎదుర్కొని వుండొచ్చు. మరీ, కిలారి ఆనంద్ పాల్‌తో కూడా తిట్టించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు.? అయినా, ఆయన పేరు రోజా ఎందుకు ప్రస్తావించినట్లు.? అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.?