ఘోర అవమానం… దుర్గేష్ కు నిడదవోలులో అలా జరిగిందేమిటి?

జనసేనలో మంచి నాయకుడిగా, సౌమ్యుడిగా, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా గోదావరి జిల్లాలో.. ప్రధానంగా ఉమ్మడి తూ.గో.లో కందుల దుర్గేష్ కు మంచి పేరుంది. పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనను గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకం అని అంటారు. అయితే ఆయనకు ఆశించిన స్థాయిలో అధిష్టాణం నుంచి మద్దతు రాలేదనే మాటలూ అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. అందుకు కారణం నాదెండ్ల మనోహర్ అనే వారూ లేకపోలేదు!

ఆ సంగతి అలా ఉంటే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమండ్రి రూరల్ సీటు తనకే అని దుర్గేష్ తో పవన్ చెప్పారని అంటారు. దీంతో జనసేన క్యాడర్ ఫుల్ జోష్ లో పనిచేసుకుపోయింది. అయితే… అందుకు చంద్రబాబు ఏమాత్రం అంగీకరించలేదని.. తన సామాజికవర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరిని కాదని కందుల దుర్గేష్ కి ఇవ్వమని తెగేసి చెప్పారని అంటారు. దీంతో… దుర్గేష్ కు పరాభవం తప్పలేదు!

అనంతరం దుర్గేష్ ను నిడదవోలు వెళ్లి పనిచేసుకోవాలని బాబు, పవన్ లు సూచించారని చెబుతారు. ఈ సమయంలో… దుర్గేష్ ఈ విషయంపై కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశించిన చోటకు వెళ్లి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో రాజమండ్రిలో ఇంతకాలం తనకు సహకరించిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు లోనూ తనకు సహాయసహకారాలు అందించాలని కోరారు.

కట్ చేస్తే… కమ్మ సామాజికవర్గం నేతలే గత కొంతకాలంగా పోటీ చేస్తున్న నిడదవోలుకు.. కాపు సామాజికవర్గానికి చెందిన కందుల దుర్గేష్ ను పంపడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారో.. లేక, ఆ టిక్కెట్ జనసేనకు కేటాయించడంపై గుర్రుగా ఉన్నారో ఏమో తెలియదు కానీ… దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు నిడదవోలు టీడీపీ నేతలు. స్థానికులను కాదని ఎక్కడినుంచో దుర్గేష్ ను తెచ్చి తమనెత్తిన పెడుతున్నారనే స్థాయిలో ఫైరవుతున్నారు!

తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కందుల దుర్గేష్ తొలిసారి అధికారికంగా నిడదవోలు వెళ్లారు. ఈ క్రమంలో… స్థానిక టీడీపీ ఇన్ చార్జ్ బూరుగుపల్లి శేషారావు మద్దతు కోరేందుకు ఆయన ఇంటికి వెళ్లగా… ఇంట్లో ఉన్నప్పటికీ లేరని చెప్పించారని, దీంతో దుర్గేష్ తీవ్ర నిరాశతో వెనుదిరిగారని తెలుస్తుంది. దీంతో… కందుల దుర్గేష్ కు కమ్మసామాజికవర్గం నేతలనుంచి వస్తున్న ఇబ్బందులను పవన్ పట్టించుకోవడం లేదనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

రాజమండ్రి రూరల్ లో పనిచేసుకుంటున్న తనను.. కమ్మ సామాజికవర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరికి టిక్కెట్ ఇవ్వాలనే కారణంతో నిడదవోలుకు పంపారు.. పోనీ పొత్తులో భాగంగా చంద్రబాబు-పవన్ ల మాట విని అక్కడికి వెళ్తే… అక్కడున్న కమ్మ సామాజికవర్గ నేతలు తనను తీవ్రంగా అవమానిస్తున్నారనే ఆవేదనను దుర్గేష్ ఆఫ్ ద రికార్డ్ వెల్లబుచ్చుతున్నారని సమాచారం.

దీంతో… రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరికి మద్దతు ఇచ్చేది లేదని జనసైనికులు చెబుతుంటే… నిడదవోలులో కందుల దుర్గేష్ కు మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయని తెలుస్తుంది. ఏదీ ఏమైనా… ఈ పొత్తుల పంచాయతీ కొన్ని నియోజకవర్గాల్లో మొదటికే మోసం తెచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు! వీటిని అధినేతలు పరిష్కరించాల్సింది పోయి… సమస్యను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.