ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో “అభిమానుల కోరిక” ఇది!

విశ్వవిఖ్యాత నట సార్వభూమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటు తెలంగాణలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అధికార బీఆరెస్స్ భావిస్తుంది! ఈ విషయంలో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయాలపై బాలయ్య స్పందించారు.

మే 28వ తేదీన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 మే 28వ తేదీన జన్మించిన ఎన్టీఆర్ కు ఇప్పుడు రాబోయేది వందో పుట్టిన రోజు. ఈ క్రమంలోనే ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నందమూరి కుటుంబంతోపాటు ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ప్లాన్ చేస్తోన్నారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన నందమూరి బాలకృష్ణ… ఏప్రిల్ 28న విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.

ఏప్రిల్ 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పండుగలా జరుపుకుంటామని బాలకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతారని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు, తన ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. అంతవరకూ భాగానే ఉంది కానీ… ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును… సీనియర్ ఎన్టీఆర్ పాత తరానికి బాగా తెలిసిన నటుడు! గడిచిన రెండున్నర దశాబ్ధాల క్రితం అద్భుతమైన పాలన అందించిన ముఖ్యమంత్రి! అయితే… నేటి తరానికి మాత్రం ఎన్టీఆర్ అంటే…. ఆయన రూపాన్ని, ఆహార్యాన్ని, వాక్ చాతుర్యాన్ని, గంభీరత్వాన్ని పునికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అనే మరింతగా తెలుసు! ఈ విషయంలో అతిశయోక్తి కానీ, మరో ఉద్దేశం కానీ ఎవరికీ ఉండనవసరం లేదు! అయితే… అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని… చంద్రబాబుతో కలిసి నడుస్తున్న నందమూరి ఫ్యామిలీ రాజకీయ దురుద్దేశంతో నిత్యం దూరం పెడుతూనే వస్తున్న పరిస్థితి.

దీంతో.. నందమూరి తారకరామారావు అసలు సిసలు వారసుడి లక్షణాలు పుష్కలంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఈ కార్యక్రమానికి పిలవాలని.. ఖచ్చితంగా పిలవాలని కోరుకుంటున్నారు నారా రహిత టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు! తాత గారి జయంతి సభలో… వీలైతే పంచెకట్టుకుని బుడ్డోడు వేదికపై ఆసీనుడైతే… ఆ సీను చూడాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే… ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారనే విమర్శను ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఆ విషయంలో చంద్రబాబు తప్పేమీలేదని సమర్ధించిన బాలకృష్ణ.. తానే అసలు సిసలు వారసుడిని, తాతకు తగ్గ మనవడిని అని చెప్పుకు తిరుగుతున్న లోకేష్, మొదలైన వారు వేదికపై ఉండగా… ఆ వేదికపై జనాల దృష్టిలో, అభిమానుల మనసుల్లో పెద్దాయనకు అసలు సిసలు వారసుడు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తారా.. ఆసీనుడు కానిస్తారా.. అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులుల్ ఎదురుచూడాలి!