అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి బుధవారం అమరావతి శాసనసభ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో జరిగిన అల్లర్ల గురించి చంద్రబాబుని అమరావతిలో కలిసి వివరించారు జేసీ. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రబోధానంద స్వామిజి దేవతలపై బూతు పదజాలంతో చేసిన ప్రసంగాల వీడియోలు, తాడిపత్రిలో ఆయన అక్రమాలకు సంబంధిన వీడియోలు, ఆశ్రమ నిర్వాహకులు జగన్ ని కలవగా వారికీ జగన్ మద్దతు పలికిన వీడియోలు మీడియా ఎదుట ఉంచారు.
జేసీ మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద స్వామిజి అక్రమాలు చాలానే ఉన్నాయి అన్నారు. ఆశ్రమంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా భక్తులు ఉన్నారు. మతాలకు, పార్టీలకు అతీతంగా దక్షిణ భర్త దేశంలో ఎన్నడూ జరగని ఘటన తాడిపత్రిలో జరిగింది. వినాయకుడి నిమజ్జనం మేళతాళాలతో వెళ్ళటం అన్నిచోట్లా ఉన్న ఆనవాయితీ. తాడిపత్రిలో ఒక ప్రత్యేకత ఉంది. వినాయక నిమజ్జన యాత్ర మూడు మసీదుల దగ్గర నుండి మొదలవుతుంది. దీనికి ముస్లిం సోదరుడు కూడా సహకరిస్తారు.
మరి వాడు ఎలా స్వామిజి అయ్యాడో నాకు తెలియట్లేదు. దేవతల గురించి భక్తులకు అసభ్యంగా ఉపన్యాసాలు ఇస్తాడు. వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వెళుతున్న మూడు ట్రాక్టర్లను తగులబెట్టాడు. ఆశ్రమం దగ్గరకు రాగానే రాళ్లతో దాడి చేయించాడు. భయపడి అందరు పారిపోయారు. తర్వాత స్వామిజి అనుచరులు విగ్రహాలను తగలబెట్టారు. ఆశ్రమం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళూ, మగవాళ్ళు, చిన్న పిల్లలుపైన కత్తులు, ఆయుధాలతో దాడి చేయించాడు. రెండు ఫ్యాక్టరీలు, వాహనాలను తగలబెట్టారు.
అంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు. రెండవరోజు కూడా ఆశ్రమమం దగ్గర అదే తరహాలో దాడులు కొనసాగాయి. ఈ విషయంలో పోలీసులకు చర్యలు తీసుకునే బాధ్యత లేదా? సుమారు పదిహేను మంది పోలీసు అధికారులు ఉన్నారు. నేను దగ్గరలోనే ఉన్నా…రాజకీయ నాయకుడిగా అక్కడకు వెళ్లడం సరికాదని వెళ్ళలేదు. పోలీసులు కూడా అనుచరుల దాడికి పారిపోయారు. దీంతో నేను అక్కడకు చేరుకొని అక్కడే ఉన్నాను. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినా అంత జరిగేది కాదు. లోకల్ పోలీసులు అట్టర్ ఫ్లాప్. వాళ్ళు మూడు పూటలా తినటానికి, ఏసీ కారులో తిరగటానికి మాత్రమే ఉన్నారు. నా మీద దాడి చేసే ధైర్యం ఎవరికీ లేదు. నా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాపై ఎన్నడూ రాళ్ల దాడి జరగలేదు. మొట్టమొదటిసారి నామీదకి రాయి వేశారు. అది నా పక్కన ఉన్న వ్యక్తికి తగలడంతో అతని తల పగిలింది.
పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులకు దొంగలకు మర్యాదలు చేస్తున్నారు. ఇదివరకు పోలీసులంటే భయపడేవాళ్ళం. ఫ్రెండ్లీ పోలీస్ అని పేదవారికి ఏదైనా జరిగితే తన్నుతున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన న్యాయం జరగట్లేదు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఆశ్రమంలో పాత ఆయిల్ డ్రమ్ములు నిండా ఉన్నాయి. వాటితో స్వామీజీకి ఏం అవసరం? డేరాబాబాను మించిపోయాడు ప్రబోధానంద బాబా. గతంలో వారి మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ముఖ్యమంత్రిగారు మొత్తం వివరాలు తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగటంతో వందలాది మంది పోలీసులు వచ్చి ఆశ్రమం గేటు తట్టారు. వందలాదిమంది ప్రాణాలను కాపాడారు. ప్రభుత్వం ఈరోజు చాల సీరియస్ గా ఉంది. ఆశ్రమంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆశ్రమం అంటే మాకూ చాల గౌరవం కానీ ఇటువంటి దొంగబాబాల వలన నమ్మకం లేకుండా పోతుంది.
గతంలో హత్యలు చేసి కోర్టుకి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు బాబాగా చలామణి అవుతున్నారు. ధార్మిక సంస్థ కోర్టుకి పోయింది. కోర్టుని గౌరవించి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్ట ప్రకారం తీసుకోవలసిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో ముఖ్యమంత్రిగారు నాది తప్పు అంటే క్షమాపణలు చెబుతా. నాకు ఏ స్వామిజీలతోను గొడవ లేదు. లోకల్ పోలీసులు ఫెయిల్ అవటంతో బయటి నుండి వచ్చిన పోలీసులు ఆశ్రమం లోపలి వెళ్లారు. నిన్న జిల్లా కలెక్టర్ పోలీసులతో కలిసి లోపలికి వెళ్ళటం జరిగింది. నాకు ఎవరి మీద కోపం లేదు. 2017 లోనే ఈ ఆశ్రమాన్ని కోర్టు అక్కడి నుండి తీసేయాలని తీర్పు ఇచ్చినది జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
ప్రెస్ మీట్ కంటే ముందు చంద్రబాబుతో భేటీ అయి బయటకు వచ్చాక వెర్షన్ ఇది
చంద్ర బాబు నుంచి ఆశించిన స్పందన రాలేదని తెలిసింది. పార్టీకి చెందిన ఎంపి, రాష్ట్రంలో నే సీనియర్ మోస్టు పొలిటిషయన్ , శాసన సభ్యుడు అయిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే రావలసినంత స్పందన రాలేదు. అయన దిగాలుగా బయటకు వచ్చారు . అంతేకాదు, తనకంటే ప్రబోధానంద స్వామీ బలవంతుడని అంగీకరించారు. తాడిపత్రి సంస్థానాధీశుడికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. తన నియోజకవర్గంలో తనకంటే బలవంతుడున్నాడని ఆయన పబ్లీక్ గా ఒప్పుకోవలసి వచ్చింది. ముఖ్యమంత్రి తో మాట్లాడి బయటకు వచ్చాక జెసి దివాకర్ రెడ్డి చెప్పిన నాలుగు ముక్కలు, మారుతున్న తాడిపత్రి రాజకీయ సమీకరణాన్ని సూచన ప్రాయంగా వెల్లడిస్తాయి. తాడిపత్రి మీద జెసి పట్టు తప్పిపోతున్నట్లేనా… రాజకీయ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఒక స్వామీజీ ద్వారా అమలుచేస్తున్నారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పాల్సిదంతా చెప్పాను.
- ఆయన ఏ విషయాన్నైనా అంత తొందరగా తేల్చి చెప్పే మనిషా , కాదు.
- స్వామి ప్రబోధానంద ఆశ్రమ కార్యకలాపాల మీద వీడియో క్లిప్పింగులు చంద్రబాబుకు ఇచ్చాను..
- తర్వాత చూసుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారు.
- అనంతలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్పాల్సింది నేను కాదు.. చినరాజప్ప.
- ప్రబోధానంద బలవంతుడు కాబట్టే నాపై దాడి చేశాడు.