జగన్, పవన్ పొత్తుపై అనూహ్య వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్, పవన్ కలయిక గురించి ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక రానున్న ఎన్నికల్లో టిడిపి గెలవాలంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందో సూచించారు. పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకోనున్నట్టు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన జేసీ ఆసక్తికర కామెంట్స్ చేసారు. జగన్, పవన్ రెండు భిన్న ధృవాలని ఆయన పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి పని చేయడం కష్టమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా వ్యక్తిగతంగా గెలుస్తారు. కానీ వారు నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారు అనడం అవాస్తవమే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఏపీలో సీఎం చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ పార్టీ ఎమ్మెల్యేల్లో 35 – 40 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ఆ అభ్యర్థుల్ని మారిస్తే మళ్ళీ చంద్రబాబే గెలుస్తారంటూ వ్యక్తం చేశారు. ప్రజలకు చంద్రబాబుపై వ్యతిరేకత లేదు కానీ మా జాతి చరిత్ర బాగోలేదు. మా జాతి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు. బాగుండేవాళ్ళను తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ చంద్రబాబు సీఎం గా గెలుస్తారు. నేను ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే గురించీ అట్లా, ఇట్లా అని ఆయనకు చెప్పలేదని తెలిపారు జేసీ దివాకర్ రెడ్డి.

ఇక రాష్ట్రంలో టిడిపి నేతలపై జరుగుతున్న ఐటి దాడుల విషయంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ప్రధాని మోదీ తీరు ఫ్యాక్షనిస్టుని తలపిస్తుందని ఆయన అన్నారు. మోదీ తానొక్కడే బ్రతకాలి అనుకుంటున్నారని, చంద్రబాబు అందరు బ్రతకాలని ఆశిస్తారని వెల్లడించారు. తుఫాను కారణంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోతే ప్రధాని ఆ ఊసు కూడా ఎత్తట్లేదు. కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్ గుంటూరు వచ్చినపుడు కనీసం బాధితులను పరామర్శించడానికి వెళ్ళకపోవడం విచారకరమని అన్నారు.

చంద్రబాబుపై కక్షతోనే రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదని ప్రధాని మోదీపై జేసీ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మరిన్ని ఐటి దాడులు జరుగుతాయని వెల్లడించారు. జగన్ సీఎం అయితే మొదట అరెస్టు చేసేది తననేనని చెప్పుకొచ్చారు జేసీ. రానున్న ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని చంద్రాబు కోరనున్నట్టు తెలిపారు. నిర్ణయం అధిష్టానానికి వదిలేస్తానన్నారు.