కళ్యాణ్ దిలీప్ సుంకరకి హ్యాండిచ్చిన జనసేన.?

కళ్యాణ్ దిలీప్ సుంకర ఒక్కరే కాదు, చాలామంది జనసేన మద్దతుదారులు జనసేన పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. అందరిలోకీ, కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఫాలోయింగ్ పరంగా వెరీ వెరీ స్పెషల్.

న్యాయవాది కూడా కావడంతో, కీలకమైన విషయాల గురించి తన కామనర్ లైబ్రరీ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి విశ్లేషణలు చేస్తుంటారు. నోటికి కొంచెం దురదెక్కువే. అడ్డగోలు తిట్లు తిట్టేస్తుంటారు మంత్రుల్ని సైతం కళ్యాణ్ దిలీప్ సుంకర.

జనసేన పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరని, జనసేన పార్టీలో ఇప్పుడెవరూ పట్టించుకోవడంలేదు. ఆయన వాస్తవానికి జనసేన పార్టీలో లేరు. కొన్నాళ్ళ క్రితం ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయినా, జనసేన కోసం తనవంతుగా యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కష్టపడుతూనే వున్నారు.

జనసేన వైపు వెళతారనుకున్న మహాసేన రాజేష్, అనూహ్యంగా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ మహాసేన రాజేష్‌కీ, కళ్యాణ్ దిలీప్ సుంకరకీ యూ ట్యూబ్ ఛానళ్ళ వేదికగా రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలో మహాసేన రాజేష్ పట్ల జనసేన నేతలు కొందరు సానుకూలత వ్యక్తం చేశారట.

టీడీపీ – జనసేన కలుస్తున్న ప్రస్తుత తరుణంలో, మహాసేన రాజేష్‌ని టార్గెట్ చేయడం మంచిది కాదనీ, టీడీపీని అస్సలు టార్గెట్ చేయొద్దనీ కళ్యాణ్ దిలీప్ సుంకరకి కొందరు జనసేన పెద్దలు సూచించారట. దాంతో కళ్యాణ్ దిలీప్ సుంకర హర్ట్ అయ్యారని అంటున్నారు.

అయినాగానీ, పవన్ కళ్యాణ్ పట్ల తనకు అభిమానం తగ్గదనీ, జనసేనతోనే వుంటాననీ చెబుతున్నారు కళ్యాణ్ దిలీప్ సుంకర.