స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టైన చంద్రబాబు నాటినుంచీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబు అరెస్ట్ వార్త విన్న అనంతరం చాలా మంది గుండె ఆగి చనిపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు “న్యాయం గెలవాలి” అని ఒక బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు నారా భువనేశ్వరి.
ఇందులో భాగంగా ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పరామర్శల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో నిర్వహించిన సభలో పలువురు ప్రశ్నలు అడగ్గా భువనేశ్వరి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా… తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడా అని నన్నపనేని రాజకుమారి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దీనికి భువనేశ్వరి మరింత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఇందులో భాగంగా… “తాత ఎక్కడున్నడని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్ కు తెలియదు. చిన్న వయసు అవ్వడంవల్ల తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం” అని భువనేశ్వరి తెలిపారు. అనంతరం స్కిల్ స్కాం కేసులో తనకు తెలిసిన విషయాలు వెల్లడించిన భువనేశ్వరి… ముందు రూ.3 వేల కోట్లు అన్నారు.. చివరికి రూ.27 కోట్లు అంటున్నారు. సాక్ష్యాధారాలు లేకుండా 48 రోజుల నుంచి చంద్రబాబును జైల్లో నిర్బంధించారు.. అని అన్నారు!
ఇదే సమయంలో ప్రజల సొమ్ముతో మా కుటుంబం ఎప్పుడూ బతకలేదు. నేను సీఐడీ అధికారులకు గ్యారంటీ ఇస్తాను. వచ్చి ఏం తనిఖీ చేసుకుంటారో చేసుకోండి.. అని సవాల్ చేశారు భువనేశ్వరి. మరి ఈ విషయంలో సీఐడీ అధికారులు ఎలా రియాక్ట్ అవుతారనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు కేసులు పెట్టి టీడీపీని బెదరగొట్టాలని చూస్తున్నారని భువనేశ్వరి ఆరోపించారు.
ఈ సందర్భంగా మైకందుకున్న జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ ప్రశ్నిస్తూ… “చంద్రబాబు రాముడైతే, మీరు సీత. లక్ష్మణుడు లాంటి పవన్ కల్యాణ్ వస్తుంటే దుర్మార్గులు మధ్యలో ఆపేశారు. మిమ్మల్ని, లోకేష్ ను పవన్ కలవడం మీకు ఎలా అనిపించింది?” అని ప్రశ్నిస్తూ.. రామాయణానికి తనదైన రీమేక్ చేసీ చూపించే ప్రయత్నం చేశారు! ఈ ప్రశ్నకు నెట్టింట వస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… భువనేశ్వరి తనదైన సమాధానం ఇచ్చారు.
“పవన్ కల్యాణ్ నా గురించి అడుగుతూనే ఉన్నారు. ఆయన కూడా మాలాగే గంజాయి, అత్యాచారాల గురించి చాలా బాధపడ్డారు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. ఆయనా మాలాగే ఆలోచిస్తున్నారు. మన రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. ఇప్పుడు ఈ చిట్ చాట్ లు వైరల్ గా హాట్ టాపిక్ గా మారుతున్నాయి!