డ్వాక్రా రుణాల మాఫీ. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన వాటిల్లో ఇదీ ఒకటి. సరే! అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాఫీ సంగతేమైందో మనకు తెలిసిందే. సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని 10 వేల రూపాయలకు పరిమితం చేశారు. ఆ విషయం పక్కన పెడితే- ఇప్పుడు తాజాగా అదే హామీని మళ్లీ తెరమీదికి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.
ఈ సారి కూడా తాము అధికారంలోకి వస్తేనే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని బాహటంగా చెబుతున్నారట తెలుగుదేశం నాయకులు. ఈ విషయం జనసేన పార్టీ జిల్లా స్థాయి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. పలువురు మహిళా సంఘాల నాయకులు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అనంతపురం, విజయనగరం జిల్లాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పవన్ కల్యాణ్.
అనంతరం ఆయన డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-రెండోసారి కూడా తమకు ఓటు వేస్తేనే రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం నాయకులు ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని అన్నారు.
తాను కొంతమంది అధికారులతో మాట్లాడానని, రాష్ట్రం మొత్తం మీద 10 శాతం మాత్రమే డ్వాక్రా గ్రూపు సంఘాలు క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వం ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందనే విషయం పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు తెలిసినట్టుంది. ఈ విషయం సాధారణ జనాలకు ఎప్పుడో తెలుసు.
ఒక్క రుణాల విషయంలోనేనా? కాదే! రాజధాని నిర్మాణంలోనూ ప్రభుత్వానిది ఇదే వైఖరి. తాను మళ్లీ వస్తేనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని చంద్రబాబు ఓ రకంగా బెదిరిస్తున్నారు కూడా. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆ పని మాత్రం చేయట్లేదు. ఎన్నికలు రేపనగా- ఇవ్వాళ ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల ఒరిగేదేమీ ఉండదనే విషయం ఆయనకూ తెలుసు.