ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార కూటమి నేతలు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా చంద్రబాబు అయితే.. శ్వేతపత్రాలు అని చెబుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో సహజవనరుల దోపిడీ జరిగిందని.. దీని విలువ రూ.55 వేల కోట్లు అని దుయ్యబట్టారు.
ఈ సమయంలో అనూహ్యంగా… గత ప్రభుత్వ హయాంలోనే కాదు, మన ప్రభుత్వ హయాంలో కూడా ఈ దోపిడీ ఆగడం లేదు, యదేచ్ఛగా సాగుతుంది అని అంటున్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ దీనికి సంబంధించి సాక్ష్యంగా ఓ వీడియో పెట్టి, ఆ సహజ వనరుల గొప్పతనాన్ని వివరిస్తూ పెద్ద ట్వీటే పెట్టారు. దీనికి కొన్ని స్క్రీన్ షాట్లు జతచేశారు. ఈ దోపిడీని ఆపాలని పవన్ కు ఫిర్యాదు చేశారు.
“ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుండి ఎదేచ్చగా దాడి జరుగుతుంది అని నాకు సమాచారం వచ్చింది”
“అధికారులు తక్షణమే స్పందించాలి.. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ కి కూడా తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఈ సమయంలో అక్కడ జరుగుతున్న సహజవనరుల దోపిడీకి సంబంధించిన ఓ వీడియోనూ జత చేశారు. ఇదే సమయంలో ఆ ఎర్రమట్టి దిబ్బల ఔనత్యానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్ లనూ జత చేశారు. దీంతో… ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అక్కడ ఎర్రమట్టి దిబ్బలను కొల్లగొట్టాలంటే కచ్చితంగా అధికారపార్టీ అండ, అధికారుల తోడు ఉండాలనేది తెలిసిన విషయమే. అంటే… అధికారపార్టీ నేతలకు తెలిసే దోపిడీ జరుగుతుందన్నమాట. ఆ విషయం బొలిశెట్టికి తెలియంది కాదు. అయినప్పటికీ… ఈ విషయాని ప్రజలందరికీ తెలిసేలా పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరి గత ప్రభుత్వ హయాంలో సహజవనరుల దోపిడీ జరిగిపోయిందని చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో… ఇలా వీడియో సాక్ష్యాలతో సహా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దోపిడీ గురించి స్వయంగా జనసేన నేత చేసిన ఫిర్యాదుకు.. పర్యాటక శాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్ ఏ మేరకు స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయన వెంటనే స్పందించాలనే డిమాండూ పెరిగింది.
నిజంగా ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. తమ కూటమికే చెందిన దోపిడీదారుల్ని అడ్డుకుంటారా.. లేక అభాసుపాలు అవుతారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒక వేళ అడ్డుకుంటే మాత్రం పవన్ ఆ శాఖకు సమర్థుడైన మంత్రికిందే లెక్క… అలా కానిపక్షంలో పవన్ అసమర్థతకు ఇది తాజా నిదర్శనం అని భావించడమే!
ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక… pic.twitter.com/7qUPCe3ewW
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) July 16, 2024