ఆడుకుంటున్న నెటిజన్లు… హృతిక్ రోషన్ చేతులకున్న వేళ్లు 11!

సినిమాల్లో ఎంత గొప్ప స్టార్ హీరోనో.. రాజకీయాల్లో అంత గొప్ప కమెడియన్ అనే కామెంట్లు పవన్ కల్యాణ్ విషయంలో ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తుంటాయి! పైగా భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఓడిపోయిన అనంతరం ఆయనలో రాజకీయంగా హీరొ దెబ్బతిన్నాడని.. ఇప్పుడు పిఠాపురం వెళ్లి వర్మ చేతులు పట్టుకుని.. తన గెలుపు బాధ్యత తమదే అని విన్నవించుకున్న విధానం చూస్తే పూర్తిగా పోయిందని కామెంట్లు పెడుతున్నారు! ఈ సమయంలో జనసేనకు కేటాయించిన సీట్లు 11 అనే చర్చ తెరపైకి రావడంతో… పవన్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు!

రానున్న ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేనలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ 144, బీజేపీ 10, జనసేన 21 అసెంబ్లీ స్థానల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి ఈ కూటమిలో బీజేపీ చేరకముందు వరకూ… జనసేనకు కేటాయించే సీట్లపై ఏపీలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 70 అని ఒకరంటే 60 అయినా పర్లేదని ఇంకొకరు, కనీసం 50 అని మరొకరు చెప్పగా… 24 వద్ద ఆగింది లెక్క. దీంతో… జనసైనికుల్లోనూ, కాపు సామాజికవర్గంలోనూ చీలిక వచ్చిందని చెబుతుంటారు.

అందులో భాగంగా… ఇంతకు మించిన నిస్సిగ్గు చర్య మరొకటి లేదని ఒకరంటే… పసుపు జెండా మోయడానికి ఇంత సెటప్ అవసరమా అని ఇంకొకరు కామెంట్ చేశారు! ఇది కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు షూస్ వద్ద తాకట్టు పెట్టడమే అని ఇంకొకరు!! ఈ పరిస్థితుల్లో పవన్ మాత్రం అసలు 24 సీట్లు తీసుకోవడానికి గల కారణాన్ని సవివరంగా వివరించారు. ఇందులో భాగంగా… గాయత్రీ మంత్రంలో అక్షరాలు 24 అని, అశోక ధర్మ చక్రంలో ఆకులు 24 అని తనదైన శైలిలో చెప్పారు!

అక్కడికీ కొంతమంది జనసైనికులు కూల్ అవ్వకపోయే సరికి ఓపెన్ అయిపోయారనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో… అసలు మన స్టామినా ఎంత..? మన పార్టీ నిర్మాణం ఏంటి..? మనం అడిగే సీట్లెన్ని..? టీడీపీలాగా గ్రామస్థాయి నుంచి పాతుకుపోయిన పార్టీ కాదు మనది.. 50 మందికి బోజనాలు పెట్టగలమా అన్న స్థాయిలో చాలా చులకనగా మాట్లాడుతూ.. పరోక్షంగా తనను తాను చులకన చేసుకుంటున్న విషయాన్ని మరిచిపోయారనే చర్చ జరిగింది!

పోనీ ఆ 24 అయినా మిగిలాయా అంటే… బీజేపీ రాకతో అవి 21కి చేరాయి. అప్పట్లోనూ ఈ 21 నెంబర్ పై ఆన్ లైన్ వేదికగా విపరీతమైన వెటకారాలు తెరపైకి వచ్చాయి. వినాయకుడికి పూజ చేసే పత్రాల రకాలు 21 అని ఒకరంటే… ఒక వ్యక్తికి కనీస వివాహ అర్హత వయసు 21 అని మరికొంతమంది వ్యాఖ్యానించారు!!

అయితే.. ఆ 21 కూడా పూర్తిగా జనసేన నేతలు కాదని.. రానున్న ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తున్నది 11 మంది మాత్రమే అని.. మిగిలినవారంతా చంద్రబాబు పంపిన వారే అని.. పవన్ సీసాలో బాబు సరుకు అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు! దీంతో ఈ విమర్శల్లో నిజమెంత.. కేవలం ఆరోపణలేనా.. లేక, వాస్తవం కూడా ఉందా అనే చర్చ తెరపైకి రాగానే… తదనుగుణంగా ప్రూఫ్ లు కూడా వచ్చాయి!

అవును… రానున్న ఎన్నికల్లో పైకి 21 స్థానాలు దక్కించుకున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ… జనసేనకు వాస్తవంగా దక్కింది 11 స్థానాలే అని.. 21 అని చెప్పుకొవడం ఆత్మవంచన అని అంటున్నారు పరిశీలకులు. 21 స్థానాల్లో కేవలం కాకినాడ రూరల్, నరసాపురం, నెలిమర్ల, తాడేపల్లిగూడెం, తెనాలి, యలమంచలి, పోలవరం నియోజకవర్గాల్లో మాత్రమే గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన వారే మళ్లీ ఇప్పుడు పొత్తులోనూ పోటీచేస్తున్నారు!

అలాగే, పవన్‌ పోటీచేసే పిఠాపురంతో పాటు నిడదవోలులో పోటీచేస్తున్న కందుల దుర్గేష్‌ కూడా గత ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల నుంచి జనసేన తరఫునే పోటీచేశారు. ఇక గత ఎన్నికల్లో పోటీచేయలేకపోయినా.. ఇప్పుడు రాజోలు, రాజానగరాల్లో పనిచేస్తున్న అభ్యర్థులు గత కొంతకాలంగా పార్టీకి పనిచేస్తున్నవారే అని.. మిగిలినవారంతా చంద్రబాబు పంపిన నేతలే అని అంటున్నారంట!

ఇక గత ఎన్నికల్లో పోటీచేయకపోయినా ఇప్పుడు రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన అభ్యర్థులు నాలుగైదేళ్లుగా పార్టీ కోసం పనిచేసున్నారని.. మిగిలిన 10 స్థానాల్లో మాత్రం ఇప్పుడు కొత్తగా పార్టీలోకి చేరిన నాయకులేనని అంటున్నారు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ 11 వెనుక కూడా ఏదైనా మంత్రమో, పూజలో పత్రమో దాగి ఉంటుందని ఒకరు అంటుంటే… సినిమా ఇండస్ట్రీకే చెందిన హృతిక్ రోషన్ చేతులకు ఉన్న వేళ్లు 11 అని మరికొంతమంది ఎద్దేవా చేస్తున్నారు!!