కాపు నేస్తం పథకంలో భాగంగా జగన్ సర్కార్ విడుదల చేసిన నిధుల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాపులను సర్కార్ నిలువునా మోసం చేస్తుందని..దొంగ లెక్కలు చూపిస్తూ కాపుల నోళ్లు నొక్కేస్తున్నారని మండపడ్డారు. ఇంకా కాపుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేసారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను మంత్రి కురసాల కన్నబాబు తిప్పి కొట్టారు. తాజాగా ఈ వేడిలోకి కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఎంటరై పవన్ తీరును తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటే బాగుంటుందని కీలక వ్యాఖ్యలు చేసారు.
కాపులను మళ్లీ పవన్ చంద్రబాబు నాయుడు వైపు తిప్పాలని చూస్తున్నట్లు ఆరోపించారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా అదే పార్టీలో ఉండి వైకాపా మద్దతిస్తుంటే ఆ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్ధమవుతుందన్నారు. కాపులు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల నుంచి పవన్ పోటీ చేసి ఓడిపోవడం తో ఆయన బలం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుం దన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో కాపులకు 1600 కోట్లు ఖర్చుపెట్టినప్పుడు ప్రశ్నించలేదు. కానీ జగన్ ఇప్పుడు 2000 కోట్టు ఖర్చు చేస్తుంటే ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ బాగా నటిస్తున్నాడంటూ రాజా ఎద్దేవా చేసారు.
టీడీపీ హయాంలో కాపులకు తీరని ద్రోహాలు జరిగినప్పుడు ఏ రోజు పవన్ ఆయన్ని ప్రశ్నించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇలాంటి కుళ్లు రాజకీయాలు మానుకుని, కాపుల అభివృద్ధి కోరకై పాటు పడాలని సూచించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం కాపు నిధుల విషయంలో పవన్ మౌనంగా ఉన్న మాటైతే వాస్తవం. మరి మంత్రి కురసాల వ్యాఖ్యలపై, కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కం పూడి కౌంటర్లపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.