జనసేనాని పవన్ కల్యాణ్ సభలో సైనికులు రెచ్చిపోయారు. అదికూడా పవన్ కల్యాణ్ ముందే. రైతల ప్రసంగాలపై రెచ్చిపోయిన కార్యకర్తలు కుర్చీలను విసిరేయటం, విరగొట్టటం ద్వారా తమ నిరసన తెలియజేయటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పవన్ పర్యటన పెట్టుకున్నారు. అందులో భాగంగానే రెండోరోజు ఆదోని మార్కెట్ యార్డులో రైతులు, స్ధానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. సరే పవన్ ప్రసంగం మామూలే అనుకోండి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలే పవన్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో జనసైనికులు రెచ్చిపోయి వీరంగం చేశారు.
పవన్ ప్రసంగం తర్వాత రైతులు మాట్లాడారు. చంద్రబాబునాయుడు హయాంలో తాము పడుతున్న బాధలను రైతులు వివరించారు. తమకు కావాల్సిందేంటో చెప్పారు. చివరలో రైతాంగం బాగుపడాలంటే, వ్యవసాయం రంగం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలంటూ రైతు ఎల్లప్ప మైకులో గట్టిగా చెప్పారు. పవన్ అధికారంలోకి రావాలనబోయి పొరపాటున జగన్ అని అన్నారేమో అనుకున్నారు అందరూ. కానీ తర్వాత కూడా జగనే సిఎం కావాలని అప్పుడు రైతాంగ సమస్యలు పరిష్కారమవుతాయని రైతు పవన్ భుజం తడుతు చెప్పటంతో పవన్ బాగా ఇబ్బందిపడ్డారు.
జనసేన సభకు వచ్చిన రైతు వేదికపై నుండే అదికూడా పవన్ తోనే జగన్ ను సిఎం చేయాలని చెప్పారంటే పవన్ పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవాల్సిందే. వెంటనే పవన్ పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ కు సైగ చేయగానే రైతు దగ్గర నుండి మైకును తీసేసుకున్నారు. తర్వాత మరో రైతును మాట్లాడమని చెప్పారు. రెండో రైతు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని సమస్యలను చెబుతూనే తాను అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని కానంటూనే జై జగన్ అంటూ నినాదాలివ్వటంతో కార్యకర్తలకు ఒక్కసారిగా మండిపోయింది.
దాంతో బ్యారికేడ్లను తన్నుకుంటూ, కూల్చీసి వేదిక దగ్గరకు వచ్చేశారు. అయితే భద్రతా సిబ్బంది అడ్డుకోవటంతో అక్కడున్న కుర్చీలను విసిరికొట్టటం, నేలకేసి బాదటంతో చాలా కుర్చీలు విరిగిపోయాయి. ఎంత చెప్పినా కార్యకర్తల ఆవేశం అదుపులోకి రాకపోవటంతో చేసేది లేక చివరకు పవన్ రైతు సభను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయారు.