అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు రాహుల్ కు ఏ విషయం తెలియకుండా అడ్డుకుంటున్నారన్నారు. పార్టీలో ఉన్న పాత విధానాలు మారాలని లేకుంటే పార్టీ మనుగడ కష్టమన్నారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం చిట్ చాట్ గా మాట్లాడిన జగ్గారెడ్డి ఏమన్నారంటే

“పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలి. రాష్ట్రంలో పార్టీ కోసం నిజంగా కష్టపడే వారికి ఢిల్లీ లో అంత ప్రాధాన్యత లేదు. ఢిల్లీలో లాబీయింగ్ సిస్టం బంద్ కావాలి. కష్టపడేవారిని రాహుల్ దగ్గరికి కొఠారి వెళ్లనివ్వడం లేదు. ప్రజలు బాగా రిసీవ్ చేసుకునే నాయకుడినే అధిష్టానం గుర్తించి ,ప్రోత్సహించాలి. లాబీయింగ్ లతో సీఎల్పీ నేత ఎన్నిక జరిగితే పార్టీకి నష్టం జరుగుతుంది. సమర్థుడైన సిఎల్పీ లీడర్ కోసం రాహుల్ రహస్యంగా నివేదిక తెప్పించుకోవాలి. ఎమ్మెల్యేలు ,ముఖ్య నేతల అభిప్రాయాలను గౌరవించాలి.

 తెలంగాణలో జరిగే పరిణామాలు ఏవి కూడా రాహుల్ కు తెలియడం లేదు. రాహుల్ కి తెలియకుండా కొంత మంది అధిష్టానాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. దీనిని అదును చేసుకొని టిఆర్ ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే ప్రమాదం ఉంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టే టిఆర్ఎస్ లో చేరుతున్నారు. మరి కొంత మంది నేతలను కూడా టిఆర్ఎస్ మభ్యపెట్టే అవకాశం ఉంది. కాబట్టి సరైన నాయకులకు, ప్రజాధారణ ఉన్న వారికే సీఎల్పీ అవకాశం ఇవ్వాలి. లేకుంటే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.” అని జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.