ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకలయాత్ర 333 వ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సాగింది. పాదయాత్ర విరామం అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భముగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసారు. చంద్రబాబు పాలనతీరును, టీడీపీ నేతలను ఎండగట్టే ప్రయత్నం చేసారు.
తిత్లీ బాధితులను ఆదుకోవడంలో ప్రభత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేసారు. తిత్లీ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ధీటుగా హామీలు ప్రకటించారు. కిడ్నీ బాధితుల కోసం తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి బ్రేకులు వేసే దిశగా జనాన్ని ఆకట్టుకోడానికి ప్రయత్నించారు జగన్. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
శ్రీకాకుళం తుఫాను నష్టంపై మాట్లాడిన జగన్… తుఫాను వల్ల 3 ,435 కోట్లు నష్టమని లేఖ రాసిన చంద్రబాబు 500 కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. తుఫానుపై విజయం సాధించామని ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు రాష్ట్రానికి ఏమీ చేయని బాబు ఎన్నికలకు మూడు నెలల ముందు కడపకు వెళ్లి స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు యువనేస్తాం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తారు. బాబు పాలనలో రేషన్ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇచ్చే బియ్యంలో మెట్రిక్ పేరుతో కోత అంటూ మండిపడ్డారు జగన్. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్రహించిన జగన్ ఉద్దానం కిడ్నీ బాధితులకు పవన్ ఇచ్చిన హామీ కంటే అదిరిపోయే వరం ప్రకటించారు. ఈ భారీ హామీతో ఉత్తరాంధ్ర ప్రజల్లో పవన్ సంపాదించుకున్న క్రేజ్ ని తనవైపు మళ్లించుకునే స్కెచ్ వేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పలాసలో కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. కిడ్నీ బాధితులకు నెల నెలా పదివేల రూపాయల పింఛన్ ఇస్తానని ప్రకటించారు. కిడ్నీ బాధితులకు బాబు చేసిందేమిటి? కేవలం 370 మందికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు బాబు ఈ ప్రాంతంలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క ఇటుకైనా పడిందా? అని ప్రశ్నించారు జగన్. చంద్రబాబుకు కష్టమొచ్చినప్పుడల్లా పవన్ ప్రత్యక్షమవుతారు. ఉద్దానం బాధితులను పరామర్శిస్తారు. ఎల్లో మీడియా చంద్రబాబు ఏదో ఆడుకున్నట్టు ప్రచారం చేస్తాయి అని విమర్శించారు జగన్.
తిత్లీ తుఫాను బాధితులను ఉద్దేశించి వైసీపీ అధికారంలోకి వస్తే నష్టపోయిన జీడి తోటకు హెక్టారుకు 50 వేల రూపాయలు పెంచి ఇస్తాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 3 వేలు ఇస్తామని ప్రకటించారు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే పేదింటి పిల్లలను నేను చదివిస్తా అంటూ భరోసా ఇచ్చారు. 2024 నాటికి గ్రామాల్లో పూర్తిగా మద్యం లేకుండా చేసి అక్కాచెల్లెళ్ల జీవితాల్లో చిరునవ్వులు నింపుతాం అని తెలిపారు జగన్. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. వారికి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ పధకాలను డోర్ డెలివరీ చేస్తామని అన్నారు. గ్రామ సచివాలయాలు ద్వారా ప్రతి గ్రామంలో 10 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని ప్రకటించారు జగన్.