చంద్రబాబు అంటే… కొత్త అర్థం చెప్పిన జగన్

నా 3648 కి.మీ పాదయాత్రలో ఎస్‌.కోట నియోజకవర్గంలో కూడా సాగింది. ఆరోజు మీరు చెప్పిన ప్రతి సమస్య నాకు గుర్తుంది. అందుకే నేనున్నానని చెబుదామని వచ్చా: జగన్

ముప్ఫై యేళ్లుగా మీరు టిటిపిని గెలిపించారు. ఈ కాలంలో విజయవతంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన మూడు పనులను చెప్పండి, అని వైసిసి అధినేత జగన్మోహన్ రెడ్డి  ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపు కోట (ఎస్ కోట) ప్రజలను ప్రశ్నించారు. ఈ రోజు ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ పాలన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద దాడి తీవ్రం చేశారు. చంద్రబాబు మోసాల పుట్టగా వర్ణించారు.

‘మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశాక ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క 2004లో తప్ప 30 ఏళ్ల నుంచి ఆ పార్టీనే గెలిపించారు. మీరు ఇంతగా ఆ పార్టీని ఆదరించారు. మరి ప్రజలు మెచ్చుకునే కనీసం 3 పనులైనా జరిగాయా?,’ అని  అడిగారు.

‘ ఎల్‌.కోట, కొత్తవలస, వేపాడ మండలాల్లో నిరంతరం కరువే. ఇక్కడ చేరువలోనే రైవాడ రిజర్వాయర్‌ ఉన్నా తాగు, సాగు నీటికి కటకటే. రైవాడ రిజర్వాయర్‌ నుంచి విశాఖ పారిశ్రామిక వాడకు నీరు తరలిస్తున్నారు. కానీ ఇక్కడి వారి గురించి పట్టించుకోవడం లేదు,’ అని ఆయన అన్నారు.

చంద్రబాబు వచ్చాక అన్నీ అనర్థాలే అని చెబుతూ , ‘  బాబు వచ్చాక పరిశ్రమలు మూతబడతాయి. ఇక్కడ కూడా చక్కెర కర్మాగారం భీమిసింగి కంపెనీ మూతబడింది. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ కంపెనీని చంద్రబాబు దగ్గరుండి మూసివేయించాడు. ఆ తర్వాత  వైయస్సార్‌ సీఎం కాగానే, దాన్ని తెరిపించగా, మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం కాగానే కంపెనీ రూ.43 కోట్ల అప్పుల్లో పడింది,’ అని అన్నారు.

 ‘ విశాఖ నగరానికి అతి సమీపంలో ఉన్నా ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా, జూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలు విద్యుత్‌ ఛార్జీలతో మూతబడుతున్నాయి. రెల్లి వద్ద గిరిజన వర్సిటీ పనులు 5 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.– 2014 ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఆ ఏడాది ఏప్రిల్‌లో 650 వాగ్ధానాలు చేశారు.
ఇప్పుడు మళ్లీ ఏప్రిల్‌లో మళ్లీ మోసం చేసేందుకు వందల వాగ్ధానాలు చేస్తున్నాడ,’ అని అంటూ దీనికి కారణం చెప్పారు.

ఈ మోసాలకు కారణం: 

చంద్రబాబు పుట్టిన తేదీలోనే దీనికి రహస్యం ఉందని జగన్ చెప్పారు.
‘చంద్రబాబు పుట్టినతేదీ ఏప్రిల్‌ 20. అంటే 4వ నెల, 20వ తేదీ. ఇంకా చెప్పాలంటే 420. ఆయన బుద్ధులు కూడా అలాగే ఉన్నాయి. చంద్రబాబు పుట్టినరోజు మహాత్యమో లేక నైజమో కానీ. ఆయన తన జీవితమంతా ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారు.చంద్రబాబు సీఎం కాగానే తొలి 5 సంతకాలు చేశారు. కానీ వాటికే దిక్కూ దివాణం లేదు,’ అని ఆయన హర్షధ్వానాల వ్యాఖ్యానించారు.