పవన్ కల్యాణ్ రాజకీయం నిన్నటి వరకూ ఒకెత్తు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒకెత్తు అన్నట్లుగా మారిపోయిందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జనసేన కేడర్ తో పాటు ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గంలో బలంగా నడుస్తుందని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో తనను ఎవరైనా ప్రశ్నిస్తే వారు నా వాళ్లు కాదు అని పవన్ ఇస్తున్న స్టేట్ మెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
మరి ముఖ్యంగా తాడేపల్లిగూడేంలో జరిగిన “జెండా” సభలో పవన్ ప్రసంగంపై కాపుసామాజికవర్గంలోని నేతలు, ప్రజానికం నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది. ఆ సభలో మైకందుకున్న పవన్.. కాపు సామాజికవర్గాన్ని అవమానించేలా మాట్లాడిన సంగతి తెలిసిందే. తన పార్టీ నేతలు ఓట్లు వేయించలేరని.. ఎన్నికల సమయంలో కనీసం పదిమందికి భోజనం పెట్టలేరు అన్నట్లుగా.. ఏ నాయకుడూ మాట్లాడని స్థాయిలో మాట్లాడారు!
అయితే ఆ ప్రసంగం అనంతరం పవన్ పై ప్రధానంగా గోదావరి జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తుంది. పైగా అటు హరిరామజోగయ్య, ఇటు ముద్రగడ పద్మనాభం పవన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో… భీమవరం నుంచి పవన్ పోటీ నుంచి విరమించుకున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కథనాలొచ్చాయి.
ఈ నేపథ్యంలో… తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన “జెండా” సభ ప్రసంగం అనంతరం పిఠాపురంలో పోటీ ఆలోచన కూడా పవన్ విరమించుకున్నారనే చర్చ తాజాగా ఏపీ రాజకీయవర్గాల్లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా… తమను అవమానించేలా, తమవల్ల ఏమీ కాదనేలా పవన్ చేసిన ప్రసంగంపై గోదావరి జిల్లా కాపులు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారని.. ఆ ఆగ్రహం పోలింగ్ బూత్ లో కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఈ సమయంలో మరో సేఫ్ ప్లేస్ కోసం పవన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా భీమవరం, పిఠాపురం నియోజకవర్గాల నుంచి కాకుండా… తిరుపతి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే ఐవీఆర్ సర్వే కాల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఈ విషయంలో షాకవ్వడం జనసైనికుల వంతయ్యిందని అంటున్నారు. గతంలో భీమవరం అని ఒకసారి, పిఠాపురం అని మరోసారి చెప్పిన నేపథ్యంలో… తాజాగా తిరుపతి అని ఎందుకు అంటున్నారనే చర్చ మొదలైందంట.
దీంతో… పవన్ పై గోదావరి జిల్లాల్లోని జనసైనికులు, నేతలు, కాపు సామాజికవర్గంలోని పెద్దలు కొంతమంది గుర్రుగా ఉన్నారని.. ఆ భయం పవన్ లో ఇప్పుడు మొదలైందని.. అందుకే కోస్తా జిల్లాల్లో పోటీ చేయడం ఈ సమయంలో రిస్క్ అని భావించారని.. అందుకే గతంలో ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిని గెలిపించిన తిరుపతి అయితే ఎలా ఉంటుందనే విషయంలో సర్వే చేయిస్తున్నారని తెలుస్తుంది.
మరి తిరుపతిలో సర్వే ఫలితాలు ఎలా వస్తాయి.. ఆ సర్వే ఫలితాల అనంతరం పవన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే విషయంలో పవన్ కష్టాలు పగవాడికి కూడా రాకూడదనే కామెంట్లు ఈ సందర్భంగా దర్శనమిస్తుండటం గమనార్హం.