క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన తోట వాణి బిజెపిలో చేరబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో తోట వాణి ఓడిపోయారు. తర్వాత నిమ్మకాయల గెలుపుపై వాణి కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది.
ఈ నేపధ్యంలోనే వాణి చూపు బిజెపి వైపు చూస్తోందని ప్రచారం ఊపందుకుంది. మొన్ననే టిడిపిలో నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. వారిలో టిడిపి నుండి వీలైనంతమంది నేతలను బిజెపిలోకి తీసుకువచ్చే బాధ్యత బిజెపి నాయకత్వం కీలక నేత, నలుగురు ఎంపిల్లో ఒకరైన సుజనా పై ఉంచిందట.
ఇందులో భాగంగానే సుజనా తోట కుటుంబంతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. తోట వాణి భర్త మాజీ ఎంపి తోట నరసింహం మొన్నటి వరకూ టిడిపిలోనే ఉండేవారు. ఎన్నికలకు ముందు మాత్రమే తోట కుటుంబం వైసిపిలో చేరారు. కాబట్టి తోట కుటుంబంతో సుజనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ సంబంధాలతోనే తోట నరసింహంతో సుజనా చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వైసిపితో బిజెపిని పోల్చిచూడటం కుదరదు. బలం రీత్యా వైసిపి ఎక్కడో ఆకాశమంత ఎత్తులో ఉంటే బిజెపిలో పాతళంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపికి 50 శాతం ఓట్లు వస్తే బిజెపికి వచ్చింది 0.84 శాతం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏదో పొడిచేస్తుందని బిజెపి నేతలంటున్నారు కానీ అందులో వాస్తవమేంటో వాళ్ళకు తెలుసు. మరి ఈ పరిస్ధితుల్లో తోటవాణి బిజెపి వైపు చూడాల్సినంత అవసరం ఉందా ? అన్నదే అనుమానం. మొత్తానికి తాను బిజెపిలో చేరటం లేదని వాణి అయితే చెప్పారు లేండి.