తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో తెలుగుదేశంపార్టీలోని సినీయర్ నేతలు కొందరు బిజెపి లో చేరేందుకు రెడీ అవుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా నరేంద్రమోడి మంత్రివర్గంలో చేరిన హోం శాఖ సహాయమంత్రి, తెలంగాణా బిజెపి సీనియర్ నేత జి. కిషన్ రెడ్డిని ఢిల్లీలో ఇద్దరు టిడిపి సీనియర్ నేతలు కలవటంతో ఒక్కసారిగా టిడిపిలో వేడి రాజుకుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డిని ఇ పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి కలిశారు. వీళ్ళు ముగ్గురు భేటీ అవటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
నిజానికి తెలంగాణాలో టిడిపికి కనుచూపులో భవిష్యత్తు కనిపించటం లేదు. తెలంగాణాలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న ఒకళ్ళు ఇద్దరు నేతలు కూడా ఏదోలా బండి లాక్కొస్తున్నారు. ఏపిలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణాలో బండిని లాగుతున్నారు. తాజాగా ఏపిలో కూడా పార్టీ దాదాపు నేలమట్టమైపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైపోయింది.
వచ్చే ఎన్నికల నాటికి టిడిపి పుంజుకుంటుందా అన్న అనుమానం ఏపి నేతల్లోనే కనిపిస్తోంది. అందుకనే ఏపిలోని టిడిపి నేతలు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావులు బిజెపిలో చేరటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం అందిరికీ తెలిసిందే. చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన టిడిపి నేతలు కమలం బాట పట్టేట్లే ఉన్నారు. అదే జరిగితే టిడిపి బోర్డు తిప్పేసే రోజు ఎంతో దూరంలో లేదనే అనిపిస్తోంది.