అక్రమాస్తుల ఆరోపణలపై ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడుకు బినామీనా ? అవుననే అంటున్నారు వైసిపి సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలతో అందరికీ అదే అనుమానం వస్తోంది. రెండు రోజులుగా రేవంత్ పై ఐటి, ఈడీ శాఖల ఉన్నతాధికారులు విచారణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గురువారం ఉదయం మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.
జరుగుతున్న ప్రచారం ప్రకారం రేవంత్ కి సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులున్నాయట. హాంకాంగ్, మలేషియా, అమెరికా, దుబాయ్ లాంటి దేశాల్లో భారీ ఎత్తున ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోట్లాది రూపాయలు విదేశాల నుండి రేవంత్ ఖాతాల్లోకి వచ్చి పడుతున్నట్లు అధికారులు గుర్తించారనే ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారంలో నిజముంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ విషయంపైనే భూమన మాట్లాడుతూ, సోదాల్లో, విచారణలో బయటపడుతున్న రేవంత్ ఆస్తులన్నీ చంద్రబాబువే అంటూ మండిపడ్డారు. ఏపిలో లూటి చేస్తు సంపాదించిన ఆస్తులను, అవినీతితో సంపాదించిన అక్రమాస్తులను రేవంత్ పేరుపై చంద్రబాబే పెట్టారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు వివిధ మార్గాల్లో దోచుకోవటమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. పోలవరం, పట్టిసీమ, తాత్కాలిక సచివాలయం నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించిన విషయాన్ని భూమన గుర్తు చేశారు.