జూనియర్ ఎన్టీయార్ వాడకానికి మళ్ళీ చంద్రబాబునాయుడు పెద్ద స్కెచ్ వేసినట్లే కనబడుతోంది. అవసరానికి వాడుకుని అవసరం తీరగానే వదిలించుకోవటంలో చంద్రబాబును మించినోళ్ళు లేరన్న విషయం చాలా సార్లే రుజువైంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే జూనియర్ విషయంలో అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమా సక్సెస్ మీట్ కు నందమూరి బాలకృష్ణ హాజరవ్వటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2009 ఎన్నికల్లో వాడుకున్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో కూడా జూనియర్ ను వాడుకోవటానికి రంగం సిద్దమైనట్లు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యే నందమూరి హరికృష్ణ మరణించిన దగ్గర నుండి జూనియర్ ఎన్టీయార్ వాడకం గురించి అందరూ అనుమానిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలిచేది అనుమానమే. ఎటూ హరికృష్ణ కూడా మరణించారు కాబట్టి మళ్ళీ జూనియర్ ను ఎన్నికల్లో వాడకోవటానికి చంద్రబాబు ప్లాన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా తండ్రి, కొడుకులను అవసరానికి వాడుకుని తర్వాత పార్టీనుండి దూరం పెట్టిసేన సంగతి అందిరకీ గుర్తుండే ఉంటుంది.
అందరూ అనుకున్నట్లుగానే సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ కనిపించటంతో అందరి అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే జూనియర్ కు బాలకృష్ణకు మధ్య సంబంధాలు ఏమంతా బావోలేదు. ఆ నేపధ్యంలో బాలయ్య హాజరుకాగానే చంద్రబాబుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు మొదలైపోయాయి.
దానికితోడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన బాలకృష్ణ, జూనియర్ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ను వాడుకునే ఉద్దేశ్యంతో బాలకృష్ణను చంద్రబాబే సినిమా ఫంక్షన్ కు పంపారనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.