ఒకవైపేమో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాబోయేది మనమే అని ఒకటే ఊదర గొడుతున్నారు. 130 సీట్లతో రెండోసారి టిడిపి అధికారంలికి వచ్చే విషయంలో అనుమానమే అక్కర్లేదంటూ పదే పదే నేతల బుర్రలోకి ఎక్కిస్తున్నారు. అయితే సోమవారం జరిగిన సమీక్షలో మాత్రం చంద్రబాబుకు చేదు మాత్ర మింగినట్లుగా ఉండే ఫీడ్ బ్యాక్ అందిందట కొందరు అభ్యర్ధుల నుండి.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేశాం కాబట్టి మళ్ళీ అధికారం విషయంలో ఢోకానే లేదన్నది చంద్రబాబు నమ్మకం. కానీ కొందరు అభ్యర్ధులు మాత్రం రివర్సు ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. గుంటూరు జిల్లాలోని కొందరు అభ్యర్ధులు మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా తమపై పడిందని చెప్పారట.
రైతుల నుండి రాజధాని పేరుతో బలవంతంగా భూములు లాక్కోవటం, భూములు ఇవ్వకుండా అడ్డం తిరిగిన రైతుల పంటలను తగలపెట్టించటం, రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో తోయించటం లాంటి ఘటనలతో టిడిపిపై చాలామంది రైతులతో పాటు రైతు కుటుంబాలు, కౌలు రైతులకు కూడా మండిపోతోందట.
అదే విధంగా విజయవాడలో బయటపడి రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ ఉదంతం కూడా టిడిపిపై బాగా నెగిటివ్ అయ్యిందని సమాచారం. సెక్స్ రాకెట్ కుంభకోణంలో ప్రధాన పాత్రదారులైన టిడిపి నేతలపై ఒక్క కేసు లేకపోగా అమాయకులను, వడ్డీ వ్యాపారస్తులపై మాత్రం కేసులు పెట్టి జైళ్ళకు పంపటంతో చాలామంది మండిపోయినట్లు సమాచారం. ఇటువంటి ఘటనలు రాజధాని జిల్లాల్లో టిడిపిపై వ్యతిరేక ప్రభావం చూపించినట్లు కొందరు అభ్యర్ధులు చంద్రబాబుకు వివరించారని సమాచారం.