వచ్చే ఎన్నికల్లో మామగారు నందమూరి బాలకృష్ణకే దిక్కు లేదు. అప్పుడే చిన్నల్లుడు భరత్ పోటీకి రెడీ అయిపోతున్నారట. ఈ విషయం టిడిపికి మద్దతిచ్చే మీడియానే ప్రముఖంగా చెప్పింది. పోయిన ఎన్నికల్లో నందమూరి తారకరామారావు కొడుకు, చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందుపురం అసెంబ్లీకి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వైసిపి అభ్యర్ధి నవీన్ నిశ్చల్ గట్టి పోటీనే ఇచ్చినా బాలయ్య బాబు 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
సరే, వచ్చే ఎన్నికల పరిస్దితేంటని అడగకూడదు. ఎందుకంటే, నాలుగున్నరేళ్ళల్లో బాలయ్య ఏదో చుట్టపు చూపుగానే హిందుపురంకు వెళ్ళి వస్తున్నారు. అందుకనే బాలకృష్ణను అక్కడందరూ విజిటింగ్ ఎంఎల్ఏ అని అంటుంటారు. కారణాలేవైనా బాలయ్యపై నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. జనాల్లోనే కాదు పార్టీలో కూడా. దాంతో వచ్చే ఎన్నికల్లో హిందుపురంలో మళ్ళీ పోటీ చేసే విషయంలో సందిగ్దత నెలకొంది.
ఇక, బాలయ్య బాబు పెద్దల్లుడు నారా లోకేష్ బాబు సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి కూడా దొడ్డి దోవన చట్టసభలోకి ప్రవేశించిన చరిత్ర దేశం మొత్తం మీద లోకేష్ బాబుది మాత్రమే. ప్రత్యక్ష్యంగా ఎంఎల్ఏ గా పోటీ చేసే సాహసం లేక శాసనమండలికి నామినేషన్ పై వెళ్ళిపోయి మంత్రయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెబుతున్నా ఎవరికీ నమ్మకమైతే కుదరటం లేదు. హిందుపురమని, కుప్పమని ఇలా ఏదో ఒక నియోజకవర్గం పేరైతే వార్తల్లో నలుగుతోందంతే.
ఇటువంటి పరిస్ధితుల్లో బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం నుండి ఎంపిగా పోటీ చేయటానికి రెడీ అయిపోయారట. మాజీ ఎంపి, ఎంఎల్సీ ఎంవివిఎస్ మూర్తి (గోల్డ్ స్పాట్ మూర్తి) మనవడే ఈ భరత్. ఎటూ మూర్తికి చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందులోను బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు. ఇంకేం కావలి పోటీ చేయటానికి అర్హత. కాకపోతే బాలయ్య, లోకేష్ కన్నా భరత్ కాస్త నయమనిపింకున్నారు. ఎలాగంటే పోటీ చేసే విషయంలో భరత్ లో నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ అయినా ఉంది.