ఒకటి రెండు దశబ్దాల కిందట సినిమాలు బాగా ఆడటం లేదని తెలియగానే, రెండో వారంలో మహిళలు విశేషంగా ఆదరిస్తున్న చిత్రం అని అడ్వర్టయిజ్ మెంట్లు వదిలేవాళ్లు. అంతచేసినా డబ్బాలు వెనక్కొస్తాయేమోనని చివరి దాకా టెన్సన్ తో చచ్చేవాళ్లు.
ఆంధ్రలో ఇపుడు పొలిటికల్ పార్టీ వాళ్లు, వాళ్లను నమ్ముకుని బెట్టింగులు కడుతున్న వాళ్లు ఇపుడు మహిళలు మెచ్చిన పార్టీ ఏదో అర్థం కాక నానా ఆగచాట్లు పడుతున్నారు.
బెట్టింగులు కట్టే వాళ్లు, లీడర్లు మీడియా వాళ్లకు ఫోన్లు చేసి మహిళలు మెచ్చిన పార్టీ యేదని వాకబుచేస్తున్నారు.
ఆంధ్రలో 11 వ తేదీ మధ్నాహ్నం తర్వా త క్యూలు కట్టిన మహిళలు, వృద్ధులు తమ పార్టీకి వోటేసేందుకే తీరుబడిగా వచ్చారని, లేకపోతే, వచ్చే వాళ్లే కాదని పైకి రెండు ప్రధాన పార్టీల నాయకులు చెబుతున్నారు.
రూలింగ్ పార్టీ నేత కూడా ఇలా గే వూహించి 130సీట్లొస్తున్నాయని కాకిలెక్కలు వేసినా, ఎన్నికల కమిషన్ వోటింగ్ మానిప్యులేట్ చేస్తున్నదని ఢిల్లీ రోడ్డెక్కారు. జాతీయ పార్టీలను కూడగడుతున్నారు. ఇదే విధంగా దాదాపు ముఖ్యమంత్రి అయిపోయినట్లు వైసిపి అధినేత జగన్ మెహన్ రెడ్డి ఎపుడో నిర్ణయించుకున్నారు. రోడ్ షోలలోనే ఆయన క్యాబినెట్ కూడా ఏర్పాటు చేశారు. చాలా పేర్లు ప్రకటించారు. అయితే ఇపుడా పార్టీలో చిన్నా పెద్ద లీడర్లందరికి మహిళలు మెచ్చిన పార్టీ వైసిపియా, టిడిపియా అనే సంశయం పీడిస్తూ ఉంది.
కారణం ఇదే…
మీడియా రిపోర్టుల ప్రకారం పోలింగ్ రోజున మధ్యాహ్నం తర్వాత నాలుగు నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద సీన్ మారిపోయింది. అంతవరకు వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాల దగ్గర కొండవీటి చేంతాడంతటి క్యూలు వచ్చాయి. అందులో మహిళలు,వృద్ధులు ఎక్కువ మంది కనిపించారు. మహిళలలో కనిపించిన ఈ అకస్మిక ఓటు ఆసక్తి మీద అనుమానాలొస్తున్నాయి. మహిళాలోకం చైతన్యం గురించి ప్రశంసిస్తున్నా వీరివోటు ఎటువడిందనే దానిమీద ఎవరిలో కూడా స్పష్టత లేదు
ఒక అంచనా ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం 4 గం. తర్వాత మహిళా ఓటర్లు 2014 కంటే అధికంగా ఓటేశారు. దాదాపు14 లక్షల మంది రాష్ట్రంలో క్యూలలో నిలబడుకున్నారని చెబుతున్నారు.
గురు వారం నాటికి ఓటింగ్ సరళి మీద కొంత స్పష్టత వచ్చింది. దీనితో ఎన్నికల పండితులు, టివిల ఎన్నికల నిలయ విద్వాంసులు ఈ వోట్లెటు అనే దాని మీద విశ్లేషణలు గుప్పిస్తున్నారు.
పోలింగ్ రోజు సునామీ లాగా చివరి రెండు గంటల్లో పోలింగ్ ఒక్కసారిగా పెరిగిందని ఎన్నికల కమిషన్ అందిస్తున్న వివరాలు చెబుతున్నాయి. మహిళా ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కును విని యోగించుకున్నందునే ఈ అసాధారణ వోటింగ్ పెంపు కనిపించిందని కూడా తేలింది.
పోలింగ్ నాడు పొద్టుటి నుంచి మధ్యాహ్నం తర్వాత 4 గంటల వరకు జరిగిన పోలింగ్ 50 శాతం మించ లేదు. కాని, 4 గంటల నుండి పోలింగ్ పూర్తయ్యేంత వరకూ అంటే కొన్ని చోట్ల అర్ధరాత్రి దాకా 20 నుండి 30 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇందులో ఉన్న రహస్యం ఏమిటి?
గత ఎన్నికల కంటే ఈ ఎన్ని కల్లో 13,75,107 మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటేశారని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో జిల్లాల వారిగా శ్రీకాకుళం 73,559 మంది, విజయనగరం లో 48,861, విశాఖపట్నంలో 93.181, తూర్పుగోదావరి లో 2,07,796, పశ్చిమగోదావరిలో 1,19,721, కృష్ణాలో 1,18,556, గుంటూరు లో1,58,940, ప్రకాశం లో 92,029, నెల్లూరు లో 76,085, కడప లో 24,715, కర్నూలులో 1,13,359, అనంతపురం లో 1,45,632, చిత్తూరు లో 1,02,673 మంది అంటే మొత్తంగా 13,75,107 మంది మహిళా ఓటేసేందుకు ముందుకు వచ్చారు.
ఇక్కడే పార్టీలకు , పార్టీల నమ్మకున్న బెట్టింగ్ దారలుకు చిక్కు సమస్య వస్తున్నది. మహిళలకు అకస్మాత్గుగా వచ్చిన ఈ ఆవేశం వెనక రహస్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.
పసుపు-కుంకుమ ద్వారా మేం ఇప్పటికే రెండు ధఫాలుగా రూ. 20 వేలు అందించాం., అధికారంలోకి వస్తే ప్రతి ఏటా ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చాం.మహిళలకు స్మార్ట్‌ఫోన్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో మహిళలను టిడిపి ఆకట్టుకుంది.అందుకే టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు ఇలా మహిళలు ఉప్పెనలా వచ్చారని టిడిపి లీడరొకరు చెప్పారు.
వైసిపి కూడా ఇంతే ధీమాతో ఉంది. దీనికి కారణం చంద్రబాబు మహిళలను వంచించడం,ముంచడమే నని,అందుకేవారు నాయుడికి బుద్ధి చెప్పేందుకు ఇలా వచ్చారని వైసిపి నేత ఒకరు చెప్పారు.
‘డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చేయలేదు. దానికి తోడు పావలా వడ్డీ పథకాన్ని కూడూ ఎత్తివేశాడు. దీనితో తమ మీద రుణభారం పెరిగిపోయిందని మహిళల్లో ఆందోళన మొదలయింది. చంద్రబాబు మోసం చేశాడని వారు గుర్తించారు. దీని కి తోడు గ్రామ కమిటీలు, జన్మభూమి కమిటీలంటూ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందకుండా కేవలం తెదేపా వారికి మాత్రమే అందేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిత్ కడుపు మండిన మహిళలు చంద్రబాబు వోడించేందుకు ఇలా సునామీలా తరలి వచ్చారు,’ ఆయన అన్నారు.
మొత్తానికి మహిళవోట్లెటూ అనే చర్చ కౌంటింగ్ అయ్యే దాకా చాలా రకాలుగా సాగే అవకాశం కనబడుతూ వుంది. తమాషా చూస్తూ ఉండండి.
