హాట్ టాపిక్… కాపుల ఓట్లు కూటమికి అవసరం లేదా…?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది “క్లాస్ వార్” అంటూ జగన్ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన మేలులను ఆయన వివరిస్తున్నారు. అటు పదవుల్లోనూ, ఇటు ప్రతిఫలాల్లోనూ, పథకాల్లోనూ తనకు బడుగు బలహీనవర్గాలే ప్రథమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. మైకందుకున్న ప్రతీసారీ… నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… బీసీలే తమ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకునే టీడీపీని 2019 ఎన్నికల్లో “తోకలు కత్తిరిస్తాం” అంటూ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సామాజికవర్గ ప్రజానికం చాలావరకూ దూరం పెట్టారనే సంకేతాలు వచ్చాయి. అవి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి!! ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో బీసీలను ఏదో రకంగా తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా “బీసీ డిక్లరేషన్” ని ప్రకటించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఇచ్చే వరలూ ఇవే అంటూ వెల్లడించారు.

“ఇదే పని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు..?” అనే ప్రశ్నకు బాబువద్ద సమాధానం ఉందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… తమ ప్రధాన ఓటు బ్యాంకు అని బాబు ఎన్నికల సమయంలో చెప్పుకునే బీసీలకు సరికొత్త తాయిలాలు ప్రకటించారు.. ఆ సభా వేదికపై పవన్ కూడా ఆసీనులయ్యారు. ఆ సంగతి ఆలా ఉంచితే… మరి తన బలం కాపు సామజికవర్గ ఓట్లే అని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్న పవన్… ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు?

వచ్చే ఎన్నికల్లో కాపులకు పవన్ పై ఏమాత్రం అసంతృప్తి వచ్చినా.. అపనమ్మకం ఏర్పడినా.. 2014 ఫలితాల తర్వాత పరిస్థితులు గుర్తుకువచ్చినా.. అది టీడీపీ – జనసేనలకు ఊహించని దెబ్బ కొడుతుందనడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే… వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమికి ఆ సామాజికవర్గ ఓట్లే కీలకం! అయితే… అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ కాపులకు కేటాయించిన సీట్లు ఎన్ని అనే విషయాన్ని వారు పరిగణలోకి తీసుకున్నా కూడా ఇది పెద్ద తలనొప్పే!

టిక్కెట్ల విషయంలో ఎలాగూ కాపులను ఊహించని దెబ్బ కొట్టిన పవన్ & బాబులు… కనీసం ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించడానికి “కాపు డిక్లరేషన్” వంటి ఆలోచన ఎందుకు చేయడం లేదనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా ఉంది! తనకు కావాల్సిన ఓట్ల కోసం బాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో అయినా… తాను పూర్తిగా నమ్ముకున్న కాపు ఓట్ల కోసం పవన్ ఆ మాత్రం కూడా ఆలోచన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయని తెలుస్తుంది.

కారణం… వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు టీడీపీకి.. టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ ఫర్ అవ్వడం అనేది అంత సులువైన విషయం కాదనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 30 సీట్ల వరకూ కేటాయించగా.. 20 శాతం జనాభా ఉన్న కాపులకు మాత్రం ఇచ్చిన సీట్లు 24 అని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్న మాటలు కాపులకు కనువిప్పు కలిగిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాపు డిక్లరేషన్ విషయం కూడా చర్చకు వస్తుంది. కూటమికి కాపులు అనుకూలంగా ఓట్లు వేయాలంటే కచ్చితంగా వారిని ఆకర్షించే బలమైన అంశాన్ని పవన్ లేవనెత్తాలని.. ఇప్పటికే తాను సీఎం అభ్యర్థిని కాదనే విషయం స్పష్టం చేసిన వేళ… 2014లో ప్రకటించిన కాపు రిజర్వేషన్స్ స్థాయిలో మరో కీలక అంశాన్ని ప్రకటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు పరిశీలకులు. మరి ఈ విషయాన్ని పవన్ గ్రహిస్తరా.. లేక, అతి విశ్వాసంతో ముందుకు కదులుతారా అనేది వేచి చూడాలి!