ఫిరాయింపులపై హైకోర్టు సీరియస్..స్పీకర్ కు నోటీసులు

ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై హై కోర్టు సీరియస్ అయ్యింది. ఫిరాయింపులపై తాము సమాధానం చెప్పాలని 8 నెలల క్రితం ఇచ్చిన నోటీసులకు ఇంత వరకూ జవాబు ఇవ్వకపోవటమేంటంటూ మండిపడింది, ఫిరాయింపులపై అనర్హత వేటు కేసును తామే విచారిస్తామని సుప్రింకోర్టు ధర్మాసం విచారణ అవసరం లేదని స్పష్టంగా చెప్పేసింది. పనిలో పనిగా నలుగురు ఫిరాయింపు మంత్రులతో పాటు వారిని ఎంటర్ టైన్ చేస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. వారందరికీ సమాధానాలు ఇవ్వటానికి రెండు వారాల గడువు ఇస్తున్నట్లు చెప్పింది. ఇపుడు కూడా సమాధానం ఇవ్వకపోతే కేసును ఎలా విచారించాలో తమకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

 

అపర ప్రజాస్వామ్యవాది చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఫిరాయింపులకు భారీగా తెరలేపారు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏను ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశంపార్టీలోకి లాక్కున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వగా మిగిలిన వారికి కోట్ల రూపాయలు ముట్టచెప్పటం, కాంట్రాక్టులు కట్టబెట్టటం, అప్పులు తీర్చటం తదితరాలతో లోబరుచుకున్నారు.

 

చంద్రబాబు పెడుతున్న ప్రలోభాలకు అప్పటి నుండి వైసిపి పోరాటాలు చేస్తున్న ఉపయోగం లేకపోయింది. ఫిరాయింపులను అనర్హులను చేస్తు వారి సభ్యత్వాలపై వేటు వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు హైకోర్టును ఆశ్రయించింది. దాంతో ఫిరాయింపులకు, స్పీకర్ కు, ఫిరాయిపు మంత్రులకు కోర్టు ఎనిమిది మాసాల క్రితం నోటీసులిచ్చింది. అయితే, ఒక్క ఫిరాయింపు ఎంఎల్ఏ కూడా కోర్టు నోటీసులను లెక్క చేయలేదు. అదే విషయాన్ని వైసిపి తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళటంతో కోర్టు సీరియస్ గా తీసుకుంది. అందుకే అందరికీ అక్షింతలు వేసి సమాధానం ఇవ్వటానికి రెండు వారాల గడువు ఇచ్చింది.