జగన్ పై దాడి: కేంద్రంపై హై కోర్టు ఆగ్రహం

జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కేంద్రం, హై కోర్టు మధ్య టామ్ అండ్ జెర్రీ షో సాగుతోంది. హత్యాయత్నం కేసు విచారణ విషయమై కేంద్రప్రభుత్వం తాజాగా ఇచ్చిన సీల్డ్ కవర్ సమాధానంపై హైకోర్టు తీవ్రస్ధాయిలో మండిపడింది. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ విచారణ చేస్తుందా ? చేయదా ? అని సూటిగా అడుగుతూ కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించింది. సమాధానం ఇవ్వటానికి నాలుగు రోజులు గడువు కూడా ఇచ్చింది. అయితే ఈరోజు జరిగిన విచారణలో కేంద్రం గోడమీద పిల్లివాటంలో సమాధానం ఇచ్చినట్లు అర్ధమవుతోంది.  కోర్టుకు కేంద్రం ఏమని సమాధానం ఇచ్చిందో తెలీదు. అయితే, కేంద్రం ఇచ్చిన సమాధానంపై హై కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి, వ్యక్తం చేసిన అసంతృప్తిని బట్టి కేంద్రం గోడమీద పిల్లివాటం లాగ సమాధానం ఇచ్చినట్లు అర్ధం చేసుకోవాలి.

 

హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు విషయంపై తామడిగిన ప్రశ్నకు కేంద్రం సూటిగా సమాధానం ఎందుకు చెప్పటం లేదని కోర్టు వేసిన ప్రశ్నతోనే కేంద్రం ఏరీతిలో సమాధానం ఇచ్చుంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే మరోసారి కేంద్రానికి మరికొంత సమయం ఇచ్చింది. బహుశా కేంద్రం ఇచ్చే తర్వాత సమాధానం కూడా చూసిన తర్వాత చివరకు కోర్టే ఓ నిర్ణయం తీసుకోవచ్చని జగన్ తరపున లాయర్ అభిప్రాయపడ్డారు.

 

హత్యాయత్నం ఘటన జరిగిన ప్రాంతం బట్టి దర్యాప్తు చేయాల్సింది కేంద్ర సంస్ధలే అన్నది స్పష్టమవుతోంది. మరి కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ చేయించేందుకు కేంద్రం ఇంకా ఎందుకు వెనకాడుతోందో అర్ధం కావటం లేదు. హైకోర్టు కూడా పదే పదే ప్రశ్నిస్తున్నా కేంద్రం ఎక్కడా కమిట్ కావటం లేదు. అదే సమయంలో విచారణ విషయమై ఏ దర్యాప్తు సంస్ధనైనా ఆదేశించే అధికారం కోర్టులకుంది. జగన్ పై హత్యాయత్నం కేసును విచారించాల్సిన బాధ్యత కేంద్ర దర్యాప్తు సంస్ధలదే అని కూడా కోర్టు ఓ నిర్ణయానికి వచ్చేసింది. మరి అటువంటప్పుడు ఎన్ఐఏ లేకపోతే సిబిఐ ఏదో ఓ కేంద్ర దర్యాప్తు సంస్ధను విచారించమని ఆదేశించటంలో కోర్టు కూడా ఎందుకు జాప్యం చేస్తోందో అర్దం కావటం లేదు. రోజులు గడిచేకొద్దీ కేసు తీవ్రత పలచడిపోవటం తప్ప మరింకేం జరగదన్నది మాత్రం వాస్తవం.