‘వెన్నుపోటు’ కు కొత్త అర్దం చెప్పి, వర్మ ని కెలికాడే?

సినీ నటుడు శివాజీ మరోసారి సంచలన కామెంట్స్ చేసి  వార్తలకెక్కారు. ఈ సారి ఆయన ఆపరేషన్ గరుడ అనకుండా..పరేషన్ రామ్ గోపాల్ వర్మ అనే కొత్త వాదనతో సీన్ లోకి వచ్చారు. అప్పట్లో నందమూరి తారక రామారావుకు ముఖ్యమంత్రి పదవి దూరం చేసిన వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్‌కు శివాజీ కొత్త యాంగిల్ ని చెప్పారు. అది వెన్నుపోటు కాద‌ని.. వెన్నుదన్ను అని అన్నారు. అంతేకాదు అస‌లు చంద్రబాబు ఆ రోజు అలా చేయక పోతే తెలుగుదేశం పార్టీనే కాదు.. బీజేపీ కూడా ఉండేది కాద‌ని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వాజ్‌పేయ్‌ని ప్రధాని చేయ‌బ‌ట్టే.. బీజేపీ ఇప్పటి దాకా బ‌తికి ఉంద‌ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అంతేకాకుండా పురాణాలను ప్రస్తావిస్తూ… సుగ్రీవుడి కోసం రాముడు ఏం చేశాడో.. టీడీపీ కోసం, ఏపీ కోసం చంద్రబాబు కూడా అదే చేశారని అన్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని చెబుతూనే చంద్రబాబు చర్యలను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు శివాజీ. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన శివాజీ.. అప్పుడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి మనుషులేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అలాగే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై శివాజీ కామెంట్స్ చేస్తూ.. ఈ బయోపిక్ చీకటి రోజుల్లో ఎన్టీఆర్ జీవితంపై తీస్తున్న సినిమాగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వెన్నుపోటుకి, వెన్నుదన్నుకి తేడా తెలియదని అన్నారు. అలాంటి వ్యక్తి ఎలాంటి సినిమా తీస్తాడో ఊహించుకోవచ్చని హేళన చేశారు.

అయితే రామ్ గోపాల్ వర్మ తనను టార్గెట్ చేసిన వాళ్లను ఓ రేంజిలో ఆడుకుంటూంటారు. ఆయన స్పందన ఎలా ఉంటుందో అని మీడియా మొత్తం ఎదురు చూస్తోంది. అయితే వర్మ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారని ఇగ్నోర్ చేస్తారని కొంతమంది అంటున్నారు.