Sachivalayam Employees: వార్డు సచివాయల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ సొంత మండలానికి బదిలీపై వెళ్లే అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత వార్డులో కాకుండా పట్టణంలోని ఇతర వార్డులకు , ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీకి అవకాశం కల్పించింది.
అయితే ప్రభుత్వం ఉత్తర్వులపై గ్రామ సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే శాఖకు చెందిన ఉద్యోగుల విషయంలో రెండు వేర్వేరు నిబంధనలు సరికాదని చెబుతున్నారు. తమకు కూడా ఇదే తరహాలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
కాగా గత వైసీపీ ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహించి ఉద్యోగులకు ఎంపిక చేసింది. అనంతరం ప్రతి వార్డు, పంచాయతీలో సచివాలయాలు ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ ఉద్యోగులకు జీతాల ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతుందని ఆరోపించాయి. అయితే అప్పటి జగన్ సర్కార్ మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత దగ్గరి చేసేందుకు సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చామని స్పష్టం చేసింది.