రెండు రాష్ట్రాలలో  బీజేపీకి కంటనీరు పెట్టిస్తున్న వెల్లుల్లి

(మల్యాల పళ్లంరాజు)

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిందని చెబుతారు,  అయితే, బిజెపి అరోగ్యాన్ని ఇదే వెల్లుల్లి దెబ్బతీసేలా  ఉంది మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో…

 

తెలంగాణలో తెల్లబంగారం అంటే ప్రత్తి.. కానీ,  ఉత్తరాదిలో ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో వెల్లుల్లి పంటను తెల్లబంగారంగా భావిస్తారు వ్యవసాయదారులు. ఇప్పుడు  ఆ వెల్లుల్లి ధరలే ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాల తలరాతలు మార్చేలా ఉన్నాయి. ఒకప్పుడు ఉల్లి పంట ధరల కారణంగా మహారాష్ట్రలో, ఢిల్లీలో ప్రభుత్వాలు  పతమయ్యాయి. మనరాష్ట్రంలో, ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో టమోటో రైతులు గిట్టుబాటు ధరలేక పంటలను తగుల పెట్టిన పరిస్థితి చూశాం. ఇప్పుడు వెల్లుల్లి ధరలు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ ప్రభుత్వాలకు కంటనీరు  పెట్టిస్తున్నాయి. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాదిలో తెలంగాణకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. వెల్లుల్లి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం ఆయా ప్రభుత్వాలకు పెను సవాల్ గా  మారింది. వెల్లుల్లి వ్యవసాయంలో సంక్షోభాన్ని ఆయుధంగా చేసుకుని బిజెపితో కాంగ్రెస్ పార్టీ తలపడుతూ ఉంది.

పైకి పార్టీ హంగామా ఇలా ఉన్నా లోన రైతాంగం ఆగ్రహంతో ఉడికిపోతున్నది

 

2014లో బీజేపీ మహానేత నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాల్లో దేశంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని, అన్ని పంటలకూ గిట్టుబాటు ధరలు అందేటట్లు చూడడమే కాక, ఉచిత బీమా తో పాటు  సాగునీరు కల్పన, ఇతర సౌకర్యాలు కల్పించి వ్యవసాయరంగానికి పరిశ్రమలతో సమానమైన హోదా కల్పిస్తామని ఎన్నో ఆశలు చూపారు. కొన్ని దశాబ్దాలుగా ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, కాంగ్రెస్ సర్కార్ విధానాలతో విసిగి వేసారిన రైతాంగం ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా రైతాంగం మోదీకి అండగా నిలవడంతో అనూహ్యమైన మెజారిటీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది.వివిధ రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. జరిగింది మాత్రం నామమాత్రమే. బీమా వంటి పథకాలు తప్ప, రైతాంగానికి గిట్టుబాటు ధర లభించనే లేదు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వెల్లుల్లి ఘాటు తగ్గించే మార్గం తెలీక సతమతమవుతున్నారు.

వచ్చే రెండు నెలల్లో  ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో గిట్టుబాటు ధరలేక వెల్లుల్లి పండించే రైతులు ప్రాణాంతక పరిస్థితి ఎదుర్కొంటున్నారు.  ఒకప్పుడు కిలో 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకూ అమ్ముకున్న వెల్లుల్లి రైతులు అదే వెల్లుల్లిని ఇప్పుడు 1 రూపాయి, 2 రూపాయలకు కిలో అమ్ముకోక తప్పని దుర్భర పరిస్థితి ఏర్పడింది.  ఫలితంగా ఎందరో వ్యవసాయదారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వెల్లుల్లి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేని రాజస్థాన్ లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరీ దారుణంగా పడిపోతున్న వెల్లుల్లి ధరలు, వ్యవసాయ దారుల ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఒక ఏడాది వెల్లుల్లి రైతులు ఆందోళన చేస్తున్నారు. 2017లో మాంద్సోర్ లో రైతుల ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. పోలీసులు కాల్పులు జరిపారు. అయిదారుగురు చనిపోయారు. మాంద్సోర్ ఆందోళన కారణం వెల్లుల్లి ధరలు పడిపోయి రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే. దేశ రక్షణ గురించి అంతగా మాట్లాడిన మోదీ ప్రభుత్వం ఈ పేదరైతుల రక్షణ కోసం ఏమీ చేయలేపోయింది. మద్దతు ధర అమలు చేయలేకపోయింది. ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.

నాణ్యమైన వెల్లుల్లి ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వ్యవసాయదారులది అందవేసిన చేయి. దేశంలో ఉత్పత్తి అయ్యే వెల్లుల్లిలో 50 శాతం ఆరాష్ట్రాలలోనే ఉత్పత్తి అవుతుంది.  

వెల్లుల్లి సాగు విస్తీర్ణం లోనూ రెండు రాష్ట్రాలదే పైచేయి. రెండే ళ్ల నుంచి   సాగు విస్తీర్ణం కూడా బాగా పెరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్ లో 92 వేల హెక్టేర్ల నుంచి  లక్షా 28 వేల హెక్టార్లకు , రాజస్థాన్ లో 69 వేల నుంచి  లక్షా 32 వేల హెక్టార్లకు  వెల్లుల్లి సాగు పెరిగింది. దీనితో  ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు కుప్పకూలిపోయాయి. మాంద్సోర్ ప్రాంతంలో  2018 మే నెల నాటికి కిలో వెల్లుల్లి ధర అక్షరాల ఒక్క రుపాయకి పడిపోయింది. మార్చిలో  ధర  రు. 20  దాకా ఉండింది. దీనితో పంటల కోతల కూలి ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కిలో 32 కు కొంటానని చెప్పింది గాని, సగం పంట కూడా కొనలేక పోయింది. దీనితో సంక్షోభంలో పడిపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రెండు మూడేళ్ల క్రితం వరకూ వెల్లుల్లి రైతులకు చక్కటి ధర లభించేది. క్వింటాలు  రూ.1000 నుంచి 1300 వరకూ లభించేది. కానీ, 2016 నవంబర్ లో పెద్దనోట్ల రద్దు.. రైతుల పాలిట అశనిపాతం అయింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అన్ని  వ్యవసాయ పంటల ధరలు విపరీతంగా పడిపోయాయి. వెల్లుల్లి రైతుల మీద ఆ ప్రభావం తప్పలేదు. ఆ తర్వాత మళ్లీ రైతులు కోలుకున్న పాపాన పోలేదు.

 పెద్ద నోట్ల రద్దు తర్వాత  2017 మార్చిలో వెల్లుల్లి కొత్త పంట మార్కెట్ లోకి రావడం మొదలైంది. కానీ, మార్కెట్ లో  వెల్లుల్లి కొనుగోలు ధరచూస్తే రైతుల దిమ్మతిరిగి పోయింది. వారు ఆశించిన కనీస ధరకన్నా మరీ తక్కువ ధర లభించింది.ఏడాది క్రితం కిలో వంద రూపాయలకు అమ్మిన రైతులకు  కిలోకు రూ. 30 కూడా లభించలేదు. దీంతో వ్యవసాయదారులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ నాటి నుంచి నేటి వరకూ రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. పలువురు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలేవీ ఫలించలేదు. మార్కెట్ లలో దళారులదే రాజ్యం. మార్క్ ఫెడ్ ల వంటి సంస్థలతో వెల్లుల్లి కొనుగోలు చేస్తామని చెప్పిన సర్కార్ లు ఆచరణలో విఫలమయ్యాయి. ఫలితంగా రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరో రెండు నెలల్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వెల్లుల్లి రైతుల ఆగ్రహం చవి చూడక తప్పదు.

 

రాజస్థాన్ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం వెల్లుల్లిచుట్టూ, వెల్లుల్లి రైతుల ఆత్మహత్యల చుట్టూ తిరుగుతూ ఉంది.

ఇదే  నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే, రైతులకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని రైతులకు గిట్టు బాటు ధరలు కల్పిస్తామని ఆశలు చూపుతూ, తాము లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ఆ రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఎదురుగాలి ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన పెద్దనోట్ల రద్దు , ఇతర తొందరపాటు నిర్ణయాల వల్ల తలెత్తిన పరిణామాలు  2019లో ఎన్నికల భవితవ్యాన్ని తారుమారు చేసే విధంగా ఉన్నాయని జాతీయస్థాయిలో బీజేపీ ఆందోళన చెందుతున్నమాటవాస్తవం.

 

(మల్యాల పళ్లం రాజు , సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ )