సెటైర్లు సరే, ఎమ్మెల్యే గంటా ఏ పార్టీలో వున్నారంట.?

మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో వున్నట్టు.? టెక్నికల్‌గా అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోనే వున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గంటా, ఆ తర్వాత పార్టీ మారేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు.

అధినేత చంద్రబాబు పర్యటనలకు సైతం గంటా దూరంగా వున్నారు.. అదీ సొంత జిల్లాలో. టీడీపీ కార్యక్రమాల్లో గంటా పాల్గొనడంలేదు. అన్నట్టు, గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు.. అదీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానంటూ.! ఏమయ్యింది ఆ రాజీనామా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

త్వరలో గంటా పార్టీ మారబోతున్నారనీ, అదీ చిరంజీవి ఆశీస్సులు తీసుకుని పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనీ ప్రచారం జరిగింది. వైసీపీలోకి ఆయన దూకేస్తారనే ప్రచారం జరగ్గా, ఆయన్ని వైసీపీలోకి కొందరు నేతలు ఆహ్వానించేశారు కూడా.

ఇంతకీ, గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా.? లేదా.? ఇదే విషయం ఆయన్ని అడిగితే, ‘మీకు మీరే ఇష్టమొచ్చినట్లు రాసేసుకుంటారు.. మళ్ళీ నన్ను అడుగుతారు. మీకు నచ్చినట్లు రాసుకుంటున్నప్పుడు.. ఈ ప్రశ్నకి సమాధానం కూడా మీరే రాసేసుకుంటే పోలా.?’ అంటూ ఎటకారం చేశారు.

ఎటకారం బాగానే వుందిగానీ, టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.? అది కూడా చెప్పరు గంటా. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసేసుకోవడమే. తప్పదు, ఎందుకంటే ఆయనకంటూ ఓ స్టాండ్ లేదాయె.! పైగా మీడియా మీద సెటైర్లొకటి.