టీడీపీ – జనసేన.! ఊగిసలాడుతున్న ఎమ్మెల్యే గంటా.!

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచినా, గంటా శ్రీనివాసరావు రాజకీయంగా అంత యాక్టివ్‌గా లేరు. టీడీపీకి అయితే చాలా చాలా దూరంగా జరిగిపోయారు. చంద్రబాబు విశాఖకు వచ్చినా, గంటా ఆయన్ని కలిసేందుకు వెళ్ళకపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.

అయితే, ఆ తర్వాత సర్దుకుపోయారు. టీడీపీ కార్యక్రమాల్లో తూతూమంత్రంగా పాల్గొంటూ వచ్చారు. కానీ, గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేనతో టచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండడం తెలుగు తమ్ముళ్ళకు అస్సలు నచ్చడంలేదు. ఓ వైపు బీజేపీతోనూ, ఇంకో వైపు జనసేనతోనూ సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు గంటా శ్రీనివాసరావు.

జనసేనాని విశాఖలో నిర్వహించే ‘వారాహి విజయ యాత్ర’ సందర్భంగా, విశాఖ జిల్లాలో పెను రాజకీయ మార్పులు తప్పవని గంటా శ్రీనివాసరావు తనకు అత్యంత సన్నిహితులైనవారితో చెబుతున్నారట.

కొన్నాళ్ళ క్రితమే వైీపీ నుంచి జనసేనలోకి పంచకర్ల రమేష్‌బాబు దూకిన సంగతి తెలిసిందే. ఆ పంచకర్ల రమేష్‌బాబుతో గంటా శ్రీనివాసరావుకి సన్నిహిత సంబంధాలున్నాయి. తన ముఖ్య అనుచరుల్లో కొందరిని ఇప్పటికే జనసేన వైపు గంటా శ్రీనివాసరావు పంపించారనే వాదనలూ లేకపోలేదు.

మరోపక్క, గంటా శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిఘా పెట్టారట. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఇప్పటికప్పుడు గంటాతో చర్చలు జరుపుతున్నారట కూడా.! పార్టీ మారబోవడంలేదని గంటా చెబుతున్నా, చంద్రబాబుకి మాత్రం నమ్మకం కుదరడంలేదని అంటున్నారు.

గంటా గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ వున్నాయ్ ఆయనకి. కానీ, పవన్ కళ్యాణ్‌తోనే గంటా శ్రీనివాసరావుకి టెర్మ్స్ అంత అనుకూలంగా లేవు. ‘గంటా విషయంలో పునరాలోచించడం మంచిది.. విశాఖలో పట్టు దొరుకుతుంది..’ అని విశాఖ జనసేన శ్రేణులు, జనసేనాని దృష్టికి తీసుకెళుతున్న దరిమిలా.. గంటా, జనసేన వైపు వెళ్ళడం దాదాపు ఖాయమే కావొచ్చు.